విభిన్నమైన కథలు మరియు పాత్రలతో ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలు తీస్తూ ప్రేక్షకులని ఆకట్టుకుంటున్న నటుడు అడివి శేష్. వైవిధ్యభరిత సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఒక అభిరుచి గల నటుడిగా మంచి పేరును దక్కించుకున్నారు.
ఇటీవలే మేజర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకి వచ్చి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ప్యాన్ ఇండియా స్థాయిలో తెరక్కిన మేజర్ చిత్రం విశేష స్థాయిలో ఆదరణ పొందింది. ఈ చిత్రానికి ప్రచార కార్యక్రమాలను తన భుజాలపై వేసుకుని అడివి శేష్ ఆ పనులను సమర్థ వంతంగా నడిపించారు. ముఖ్యంగా హిందీ ప్రేక్షకులకి ఈ సినిమాని స్పెషల్ ప్రీమియర్ షోలు వేసి బాగా ప్రచారం చేశారు.
ఇక ఇదిలా ఉంటే అడివి శేష్ త్వరలో హిట్ 2 సినిమా తో ప్రేక్షకుల ముందుకి రావాల్సి ఉంది. అయితే ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం హిట్ 2 సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి అవ్వాల్సింది. అయితే మేజర్ చిత్ర ప్రచార కార్యక్రమాలను తానే అన్నీ అయి నడిపించిన అడివి శేష్ ఆ బిజీ షెడ్యూల్ నుండి కాస్త విరామం తీసుకున్నారు.
హిట్ 2 సినిమా షూటింగ్ కు తాను ఎందుకు హాజరు అవ్వలేక పోతున్నాను అనే విషయం పై శేష్ స్వయంగా ఒక లేఖ రాశారు. అలసి పోయాను. షూటింగ్ కు కాస్త బ్రేక్ కావాలి. అందుకే హిట్ 2 ను వచ్చే నెలలో కొత్త షెడ్యూల్ కు ప్లాన్ చేస్తున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు.మానసికంగా మరియు శారీరకంగా చాలా అలసి పోయానని.. అందుకే హిట్ 2 నిర్మాత నాని మరియు దర్శకుడు శైలేష్ లను అడిగాను అని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.
అందుకు వారు కూడా ఒప్పుకున్నారని చెప్తూ, బ్రేక్ నుండి తిరిగి వచ్చాక చివరి షెడ్యూల్ లో పాల్ గొంటానని, తొందరలోనే హిట్ 2 సినిమాలోని KD పాత్రతో ప్రేక్షకుల ముందుకు వస్తానని ఆయన తెలిపారు.ఇక త్వరలోనే హిట్ 2 సినిమా ను పూర్తి చేసి విడుదల తేదీని ప్రకటిస్తామని చెప్పారు అడివి శేష్ . సినిమా షూటింగ్ ఇప్పటికే మెజార్టీ పార్ట్ పూర్తి అయ్యిందని తెలుస్తోంది.
హిట్ – ఫస్ట్ కేస్ లో విశ్వక్ సేన్ నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. కరోనా మొదటి వేవ్ ముందు చివరి హిట్ సినిమా అదే కావడం విశేషం. థియేట్రికల్ రిలీజ్ లోనే కాకుండా ఓటీటీ విడుదల తరువాత కూడా హిట్ సినిమా నిజంగా పెద్ద హిట్ అయ్యింది. అందుకే హిట్ 2 కి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. పైగా ఈ ప్రాజెక్ట్ లో అడివి శేష్ నటిస్తున్న కారణంగా ప్రేక్షకులకు సినిమాపై మరింత ఆసక్తి ఏర్పడింది.హిట్ సెకండ్ కేస్ ఎప్పుడు విడుదల అవుతుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. మరి మొదటి భాగం స్థాయిలో రెండవ కేసు కూడా ఆసక్తిగా సాగుతుందా అనేది చూడాలి.