దర్శకుడు కొరటాల శివకి ఆచార్య సినిమా డిజాస్టర్ గా నిలవటం పెద్ద తల నొప్పిగా మారిన సంగతి తెలిసిందే. డిస్ట్రిబ్యూటర్లు, బయర్ల సెటిల్మెంట్ ల సమస్య దాదాపు రెండు నెలల పాటు రకరకాల పుకార్లు మరియు వివాదాల మధ్య సాగింది. ఇక ఆ సమస్య తీరిందని ఊపిరి పీల్చుకునే లోపే మరో చిక్కు వచ్చి పడింది.
శ్రీమంతుడు, జనతా గారేజ్, భరత్ అనే నేను.. ఇలా వరుస హిట్లతో ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలోనే స్టార్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్నారు కొరటాల శివ. సమాజంలో ఉన్న పలు సమస్యలను, పరిస్థితులను కమర్షియల్ ఫార్ములాతో మిళితం చేసి తనదైన శైలిలో సినిమాలు తీయడంలో ఆయనకు ఆయనే సాటి అనిపించుకున్నారు. అయితే దాదాపు ఐదు సంవత్సరాలుగా ఆయన పెంచుకున్న ఇమేజ్.అంతా ఒక్క ఆచార్య సినిమాతో తుడిచి పెట్టుకు పోయినట్టయింది.
నిజానికి కొరటాల ముందుగా రాసుకున్న ఆచార్య కథలో కాజల్ పాత్రకు చోటు లేదట. కమర్షియల్ టచ్ కావాలనుకున్న మెగాస్టార్ చిరంజీవి హీరోయిన్ తో ఉన్న సీన్లు కొన్ని తనే రాయించి అవి కథలో పెట్టాలని కొరటాలని కోరారట. పెద్ద హీరో కాబట్టి ఆయన చెప్పింది కాదనలేక కొరటాల ఆ సీన్లను సినిమాలో ఎలాగోలా అతికించి షూటింగ్ కూడా పూర్తి చేశారు. ఇక ఎప్పటికప్పుడు షూటింగ్ వివరాలు సోషల్ మీడియాలో షికార్లు కొడుతూనే ఉన్నాయి కాబట్టి కాజల్ సినిమాలో ఉండటం ఖాయమే అనుకున్నారు అందరూ. అయితే సినిమాలో కాజల్ హీరోయిన్ గా ప్రేక్షకులతో పాటు డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుదారులు కూడా నమ్మారు.
తీరా సినిమా అయిపోయాక రషెస్ చుసిన కొరటాలకి కాజల్ సీన్లు అసలు నచ్చకపోవటంతో అవి ఎడిట్ చేసి ఫైనల్ కట్ లో ఒక్క సన్నివేశం కూడా లేకుండానే సినిమా రిలీజ్ చేసారు. ఇదే ఇప్పుడు కొరటాలకి సమస్య గా మారింది.
ఆచార్య సినిమా ధియేటర్ల వద్ద ఘోరంగా పరాజయం పాలయింది. ఆ సినిమా పంపిణీదారులకి నష్టాలలో కాస్త తిరిగి ఇవ్వాల్సిన పరిస్తితి రావడంతో.. డిజిటల్ హక్కుల ద్వారా ఆ డబ్బుని సర్దుబాటు చేశారు. అయితే ఆ క్రమంలో డిజిటల్ హక్కుదారులు ఇవ్వాల్సిన మొత్తం ఇవ్వలేదని సమాచారం. అగ్రిమెంట్ జరిగిన సమయంలో సినిమాలో కాజల్ ఉంది అని చెప్పిన సాకును చూపిస్తూ.. ఇప్పుడు సినిమాలో కాజల్ లేదు కాబట్టి ముందు ఇచ్చిన అడ్వాన్స్ నే ఫైనల్ అమౌంట్ నే మొత్తం సెటిల్మెంట్ కింద పరిగణించాలని కొరటాలకి షాక్ ఇచ్చారు డిజిటల్ హక్కుదారులు.
మొత్తానికి మెగాస్టార్ చేసిన మార్పులు చేర్పుల వల్ల, సినిమా మేకింగ్ లో దొర్లిన ఒక చిన్న తప్పిదం వల్ల కొరటాలకి 10 కోట్ల పైనే నష్టం వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. ఇక కొరటాల తదుపరి చిత్రం జూనియర్ ఎన్టీఆర్ తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాతో అయినా కొరటాల ఎలాంటి వివాదాలకు తావు లేకుండా అనుకున్నది అనుకున్నట్టు తీసి విజయం సాధించాలని ఆశిద్దాం.