మెగాస్టార్ చిరంజీవి , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి తెరపై కనిపిస్తే అదొక అరుదైన దృశ్యం. ఆ కలయికను చూడాలి అని ప్రేక్షకులు ఎంతగానో చూశారు ముఖ్యంగా మెగా అభిమానులు అయితే వాళ్ళిద్దరినీ ఒక సినిమాలో చూడటం ఒక కలగా భావించారు. అందరూ ఎదురుచూసిన ఆ సుముహూర్తం రానే వచ్చి చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ కలిసి “ఆచార్య” సినిమాలో నటించారు.
అయితే కరోనా దెబ్బకు అన్ని సినిమాలకు మల్లే ఆచార్య కూడా బాగా ఆలస్యం అయి ఈ ఏడాది వేసవిలో విడుదల అయింది. ఐతే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. అయితే అసలు కథ అక్కడే మొదలయింది.
ఆచార్య సినిమా బాక్స్ ఆఫీసు వద్ద నిరాశపర్చిన తరువాత జరిగిన వ్యవహారం.. ముదిరిన గందరగోళం అంతా ఇంతా కాదు. కొరటాల శివ ఈ చిత్రం తాలూకు వ్యాపార లావాదేవీల్లో భాగం అయ్యారు. ఆయన ఇదివరకు దర్శకత్వం వహించిన సినిమాలకు కూడా అదే తరహాలో చేశారు. అయితే ఆ చిత్రాలేవీ ఫ్లాప్ కాలేదు కాబట్టి పెద్దగా సమస్యలు ఏమీ అవ్వలేదు.
కానీ ఆచార్య సినిమా భారీగా నష్టాలు మూట గట్టుకుంది. దాంతో పంపిణీదారులు అందరూ కొరటాలనే లెక్కలు తేల్చమని తీవ్రంగా వ్యవహరించినట్లు తెలుస్తుంది. అయితే మెగాస్టార్ హీరోగా చేసిన సినిమాకి ఇలా ఒక దర్శకుడిని డబ్బులు అడగటం ఏమిటని ఎన్టీఆర్ అభిమానులు, ఇతర ప్రేక్షకులు సందేహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా, సోషల్ మీడియాలో #Justiceforkoratalashiva అంటూ ట్రెండ్ చేశారు.
ఐతే అసలు చిక్కుముడి అక్కడే ఉంది. సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం, అజ్ఞాతవాసి, వినయ విదేయ రామా సినిమాలకు ఇలాంటి సమస్య రాలేదు. ఎందుకంటే వాటికి నష్టాలు తీర్చటానికి నిర్మాతలు ఉన్నారు. ఆచార్య విషయంలో అటు రామ్ చరణ్ కానీ, ఇటు నిర్మాత నిరంజన్ రెడ్డి కానీ పూర్తిగా ఈ వ్యవహారంతో ఎప్పుడో విడిపోయారు. కొరటాల శివ తన సొంత హామీ మేరకు చిత్ర వ్యాపార లావాదేవీలు నిర్వహించారు. అందుకే బయ్యర్లు ఆయనను లెక్క తేల్చమని అడుగుతున్నారు.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆచార్య ప్రి రిలీజ్ బిజినెస్ 130 కోట్లకు (valued) జరిగింది. శాటిలైట్ మరియు డిజిటల్ హక్కుల ద్వారా ఎంతలేదన్నా 50 కోట్ల వరకూ గిట్టుబాటు అవుతుంది. సినిమా బడ్జెట్ 150 కోట్లకు మించే ప్రసక్తే లేదు. మరి అవలీలగా పరిష్కరించాల్సిన ఈ వ్యవహారాన్ని ఎందుకు ఇంత లాగుతున్నారో..అసలు ఆ మిగతా డబ్బు ఏమయిందో ఎవరికీ అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది.