మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా.. తెలుగు సినీ దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ అత్యంత భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కేవలం మన దేశంలోనే కాక అంతర్జాతీయం గానూ ఎంతో ఖ్యాతిని సంపాదించింది ఆర్ ఆర్ ఆర్ చిత్రం.
పాన్ ఇండియా సినిమాగా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా పేరును చాటుతోంది ఈ సినిమా. ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది మార్చిలో విడుదలై దాదాపు పన్నెండు కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి రికార్డులు క్రియేట్ చేసింది.
థియేటర్లలోనే కాకుండా ఓటీటీలో విడుదలైన తరువాత కూడా ఆర్ ఆర్ ఆర్ తన జోరును కొనసాగించింది. తెలుగుతో పాటు ఇతర దక్షిణ భాషల హక్కులను జీ5 (Zee 5) సొంతం చేసుకోగా.. హిందీ మరియు అంతర్జాతీయ వెర్షన్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ (Netflix) దక్కించుకుంది. ఇక నెట్ఫ్లిక్స్ లో ఆర్ ఆర్ ఆర్ సరికొత్త రికార్డులని సాధించింది. నెట్‌ఫ్లిక్స్‌లో నాన్ ఇంగ్లీష్ సినిమాల కేటగిరీలో వరుసగా మూడు వారాల పాటు ఎక్కువ వీక్షకులు చూసిన సినిమాగా రికార్డు సృష్టించింది.
అలాగే ఇటీవలే హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ప్రతి ఏడాది ఎంపిక చేసే ఉత్తమ సినిమాల జాబితాలో నిలిచి చరిత్ర సృష్టించింది ఆర్ ఆర్ ఆర్. నెట్ ఫ్లిక్స్‌లో విడుదలైన రోజు నుంచి ఈ సినిమాపై హాలీవుడ్ ప్రేక్షకులతో పాటు టెక్నీషియన్స్ కూడా పొగడ్తలు కురిపిస్తున్నారు. తాజాగా హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ స్కాట్ డెర్రిక్‌సన్ ఈ వరుసలో చేరాడు.
మార్వెల్ కామిక్స్‌లో ‘డాక్టర్ స్ట్రేంజ్’ దర్శకుడు అయిన స్కాట్ సోషల్ మీడియాలో ‘ఆర్ఆర్ఆర్’ ను పొగుడుతూ పోస్ట్ పెట్టారు. ‘నా బర్త్ డే సందర్భంగా భార్యపిల్లలతో కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను చూశాను. చాలా నచ్చింది. ఇదో అద్భుతమైన రోలర్ కోస్టర్’ అంటూ ట్వీట్ చేశారు.
మరోవైపు చాలామంది విదేశీ ప్రేక్షకులు ఆర్ ఆర్ ఆర్ సినిమాపై ఇప్పటికీ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో ఇంటర్వల్ ఎపిసోడ్ లో ఎన్టీఆర్ పులులతో బ్రిటీష్ ప్యాలెస్ లోకి చొరబడి దాడి చేసే సన్నివేశం ఎంత అద్భుతంగా ఉంటుందో తెలిసినదే. తాజాగా ట్విట్టర్ లో ఆ విడియోను ఒక హాలీవుడ్ నెటిజన్ షేర్ చేస్తూ “నేను ఇంతవరకూ 29 మార్వెల్ సినిమాలు చూసాను.. కానీ ఆర్ అర్ ఆర్ లో ఎన్టీఆర్ ట్రక్ లో పులులతో దాడి చెసే అంత అద్భుతమైన షాట్ జీవితంలో చూడలేదు” అని పోస్ట్ చేశారు. ఆ వీడియో ఏకంగా 1 Million వ్యూలు సంపాదించుకోవడం విశేషం.