మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ‘ఆచార్య’ ఆశించిన రీతిలో విజయం సాధించలేదు సరికదా బాక్సాఫీస్ దగ్గర అత్యంత ఘోర పరాజయాన్ని చవి చూసింది. డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు వచ్చాయి. అయితే అసలు కథ అక్కడే మొదలయింది.
తెలుగు సినీ పరిశ్రమ చరిత్రలో ఎన్నో సినిమాలు హిట్ అయ్యాయి అలాగే అట్టర్ ఫ్లాప్ లు కూడా అయ్యాయి. అయితే ఆచార్య సినిమా రిలీజ్ అయి డిజాస్టర్ అయిన తరువాత చోటు చేసుకున్న మలుపులు ఏదైనా సినిమాలో ఉంటే ఆ సినిమా అతి పెద్ద విజయం సాధించిన చిత్రంగా నిలిచేది ఏమో. ఎందుకంటే ఈ చిత్రం తాలూకు నష్టాల గురించి వచ్చినన్ని పుకార్లు, పలు రకాల లోగుట్టు వార్తలు మరే సినిమాపై రాలేదు.
గతంలో పలు ఇండస్ట్రీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం… ‘ఆచార్య’కు చిరంజీవి, రామ్ చరణ్ రెమ్యూనరేషన్స్ తీసుకోలేదని.. నిర్మాతలు నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి – కొరటాల శివతో కలిసి లాభాల్లో వాటా తీసుకునేందుకు వారు ఇరువురూ అంగీకరించారని తెలిసింది.
సినిమా థియేట్రికల్, శాటిలైట్, డిజిటల్ రైట్స్ అమ్మిన తర్వాత… అందులోంచి సినిమా నిర్మాణానికి అయిన ఖర్చు తీసేయగా వచ్చిన మొత్తాన్ని నాలుగు భాగాలుగా విభజించేందుకు గానూ పరస్పరం అంగీకరించినట్టుగా వార్తలు వచ్చాయి.
ఆ ఒప్పందం ప్రకారం లాభాల్లో ఒక షేర్ నిర్మాతలకు, మరో షేర్ దర్శకుడికి, మిగిలిన షేర్ చిరు – చరణ్ తీసుకునే లాగా మాట్లాడుకున్నారట. ‘ఆచార్య’ ఆశించిన రీతిలో ఆడకపోవడంతో డిస్ట్రిబ్యూటర్లను ఆదుకోవడం కోసం తాము తీసుకున్న డబ్బులను చిరంజీవి, రామ్ చరణ్ తిరిగి ఇచ్చారని తెలిసింది. వారిద్దరూ పారితోషికంగా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని, ఇటీవల ఫారిన్ హాలిడే నుంచి తిరిగి వచ్చిన చిరంజీవి ‘ఆచార్య’ నిర్మాతలను పిలిచి డబ్బులు ఇచ్చారని కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో ఇక ‘ఆచార్య’ డిస్ట్రిబ్యూటర్లకు వచ్చిన నష్టాలు ఇంకా తీరిపోయినట్టే అని అందరూ అనుకున్నారు.
అయితే థ్రిల్లర్ సినిమాలో ట్విస్టు తరహాలో ఈ విషయంలో మళ్ళీ కొత్త పుకారు తెర పైకి వచ్చింది. అసలు ఆచార్య సినిమా నష్టాలు తీర్చేందుకు అటు చిరంజీవి కానీ ఇటు రామ్ చరణ్ కానీ ఒక్క పైసా కూడా తిరిగి ఇవ్వలేదని, వారి పారితోషికం తాలూకు అమౌంట్ ను సినిమా విడుదలకు ముందే కొరటాల శివ సెటిల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఆచార్య నష్టాలు అనే థ్రిల్లర్ సినిమా ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో ఇంకెన్ని కొత్త పుకార్లకు మరియు వివాదాలకు తెర తీస్తుందో చూడాలి.