బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ ఆగస్టు 11న విడుదలకు సిద్ధమవుతోంది. కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అక్కినేని నాగ చైతన్య ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హీరో అమీర్‌ఖాన్ హైదరాబాద్‌లోని మెగాస్టార్ చిరంజీవి నివాసంలో ప్రత్యేకంగా ప్రీమియర్ షోను ప్రదర్శించారు. ఈ ప్రివ్యూ షోకు అమీర్‌ఖాన్, చిరంజీవితో పాటు నాగార్జున, రాజమౌళి, సుకుమార్ కూడా హాజరయ్యారు.
ఈ సినిమా వీక్షించిన అనంతరం మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో అమీర్ ఖాన్, నాగచైతన్య నటనను ఆయన ఎంతగానో ప్రశంసించారు. ఇది అమీర్ డ్రీమ్ ప్రాజెక్టు అని.. ఇంత అద్భుతమైన సినిమాను వీక్షించే అవకాశం ఇచ్చినందుకు బదులుగా ధన్యవాదాలు కూడా తెలియజేశారు.
అయితే లాల్‌సింగ్ చద్దా సినిమా తెలుగులో కూడా విడుదలవుతోంది. తెలుగు వెర్షన్‌కు మెగాస్టార్ చిరంజీవి సమర్పకుడిగా వ్యహరిస్తున్నారు. ఈ విషయాన్ని చిరంజీవే స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ సందర్భంగా ‘లాల్ సింగ్ చద్దా’ తెలుగు పోస్టర్‌ను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. తన ఆప్తమిత్రుడు అమీర్ ఖాన్ నటించిన ఎమోషనల్ చిత్రాన్ని తెలుగులో సమర్పించాడన్ని అదృష్టంగా భావిస్తున్నానని చిరు తెలిపారు. అమీర్‌ను మరోసారి తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని కూడా పేర్కొన్నారు.
“లాల్ సింగ్ చద్దా” హాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ‘ఫారెస్ట్ గంప్’ ఆధారంగా తెరకెక్కింది. ఆ చిత్రం ఆస్కార్ అవార్డులు కూడా గెలుచుకోవడం విశేషం. అమీర్ ఖాన్ తో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు ఈ చిత్ర విజయం పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కరీనా కపూర్, మోనా సింగ్, మానవ్ విజ్, ఆర్యా శర్మ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ తో కలిసి వయాకామ్18 స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించింది.