నటీనటులు: సుశాంత్, ప్రియా ఆనంద్, సుదర్శన్, ప్రేమ్ సాగర్, నిరోషా రామరాజు, అప్పాజీ అంబరీశ, బిందు చంద్రమౌళి, బిగ్‌బాస్ దివి, అన్నపూర్ణమ్మ, సందీప్ వారణాసి, లావణ్యరెడ్డి తదితరులు నటించారు. సంగీతం: నరేన్ ఆర్ కె సిద్ధార్ధ్, ఛాయాగ్రహణం: అర్వింద్ విశ్వనాథ్.. కథ – స్క్రీన్‌ప్లే – రాజ్ శ్రీబిష్ట్, సురేష్ మైసూర్ మాటలు – పాటలు : కిట్టు విస్సాప్రగడ.. ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వర రావునిర్మాత : ప్రవీణ్ కొల్ల ..దర్శకత్వం : లక్ష్మీ సౌజన్య
కథ: రాయలసీమ ప్రాంతంలోని బుచ్చివోలు గ్రామంలో సర్పంచ్ కోదండం (ప్రేమ్ సాగర్), అతని భార్య చాముండి (నిరోషా)లకు ఒక కొడుకు ఉంటాడు. అతని పేరు గోపాల్ ( సుదర్శన్). ఒక రోజు గోపాల్ ఆ ఊళ్లో వున్న నీళ్ల ట్యాంక్ పైకి ఎక్కి తను ప్రేమిస్తున్న సురేఖ (ప్రియా ఆనంద్) కనిపించడం లేదని, ఆమెని తన తండ్రి కోదండమే మాయం చేశాడని ఆరోపిస్తాడు. గోపాల్ తాత నరసింహం (రామరాజు) ఎప్పుడు అవకాశం లభిస్తుందా..ఎప్పుడు కోదండంని ఊరి జనాల ముందు వెదవని చేసి సర్పంచ్ పదవిని దక్కించుకోవాలా అని ఎదురుచూస్తుంటాడు. గోపాల్ నీళ్ల ట్యాంక్ ఎక్కడంతో తను చెప్పింది చేయకపోతే దూకి ఆత్యహత్య చేసుకుంటాడని, అందుకు ఒప్పుకుని సురేఖ ఎక్కడుందో వేతుకుదాం అని.. అందుకు ఎస్ ఐ వంశీను (సుశాంత్) పురమాయిస్తాడు. ఇంతకీ సురేఖ ఎవరు? తను ఎక్కడకి వెళ్లింది? తనని వంశీ తిరిగి తీసుకొచ్చాడా? తను ఎందుకు ఇంటి నుంచి పారిపోయింది? లాంటి అనేక ప్రశ్నలకు సమాధానమే ఈ వెబ్ సిరీస్ అసలు కథ.
విశ్లేషణ: మా నీళ్ళ ట్యాంక్ వెబ్ సీరీస్ మూల కథ, పాత్రల చిత్రణ మరియు నేపథ్యం చూస్తే హిందీలో బాగా పాపులర్ అయిన అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ ” పంచాయత్” గుర్తుకు వస్తుంది. అయితే ఆ పోలిక అంత వరకే. తెరకెక్కించిన విధానంలో ఎక్కడా పొంతన లేదు.
రాయలసీమ ప్రాంతంలో జరిగే కథ కాబట్టి నటీనటులందరి చేతా రాయలసీమ యాసతో మాట్లాడించారు.. అది బాగుంది..అయితే కామెడీకి ఎక్కువ ఆస్కారం ఉన్న ఈ వెబ్ సిరీస్ లో సర్పంచ్ పదవి కోసం సాగే రాజకీయాలు, నీళ్ల ట్యాంక్, ఓ అమ్మాయి మానసిక సంఘర్షణ వంటి ఎన్నో అంశాలు ఉన్నా.. 8 ఎపిసోడ్ లుగా నాలుగు గంటలకు పైగా నిడివితో సాగే అవసరం కానీ అంత సేపు బోర్ కొట్టకుండా తరువాత ఏమవుతుంది అని చూసేలా చేయడంలో దర్శకురాలు సఫలం అవ్వలేదు.
పేరుకు హీరో అయినా సుశాంత్ కి ఏమాత్రం ప్రాధాన్యత కానీ, నటనకు అవకాశం కానీ లేవు ఒక్క క్లైమాక్స్ లో తప్ప. ఏం చూసి సుశాంత్ ఈ పాత్రను ఒప్పుకున్నారు అనేది అర్థం కాదు. ఇక హీరోయిన్ గా ప్రియా ఆనంద్ పాత్రలో చిత్రణ, నేపథ్యం ఆకట్టుకునేలా ఉన్నా, మరింత బలంగా, ప్రభావ వంతంగా ఉండేలా చూసుకోవాల్సింది. ఇక ఈతరంలో తెలుగు తెరపై మంచి కమెడియన్ గా నటిస్తున్న సుదర్శన్ కు ఈ వెబ్ సిరీస్ లో చక్కని పాత్ర లభించింది. అతని నటన కూడా అద్భుతంగా ఉంది. ఇక మిగిలిన నటీనటుల్లో ప్రేమ్ సాగర్ ఆకట్టుకుంటారు. వాసు ఇంటూరి, ఒకప్పటి హీరోయిన్ నిరోషా తదితరులు పరవాలేదు.
ఇక సాంకేతిక భాగాలు అయిన కెమెరా వర్క్, మాటలు బాగున్నాయి. పాటలు కూడా పరవాలేదు కానీ నేపథ్య సంగీతం మరింత బాగుండాల్సింది.
మొత్తంగా చక్కని ఎత్తుగడ, ఆసక్తికరమైన పాత్రలు, నేపథ్యం ఉన్నప్పటికీ.. తెరకెక్కించే విధానంలో నాణ్యత, సృజనాత్మకత లోపించిన కారణంగా ” మా నీళ్ళ ట్యాంక్” ఎండిపోయిన బావి లాగా తయారయింది.