యంగ్ హీరో సుహాస్ నటించిన ‘ రైటర్ పద్మభూషణ్’ చిత్ర నిర్మాతలు తమ సినిమాను ప్రమోట్ చేసుకునేందుకు ప్రత్యేక వ్యూహాలతో ముందుకొస్తున్నారు. గత వారం రిలీజైన ఈ సినిమా ఇప్పటికే చిన్న సినిమాలలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తమ సినిమాను, దాని సందేశాన్ని మరింత మందికి చేరవేసేందుకు చిత్ర యూనిట్ శతవిధాలా ప్రయత్నిస్తోంది.
రేపు రైటర్ పద్మభూషణ్ సినిమాని మహిళల కోసం ఉచిత షోలు ప్రదర్శితం చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 38 థియేటర్లలో ఈ ఫ్రీ షోలను ప్రదర్శించనున్నారు. ఇది చిత్ర బృందం యొక్క మరొక అద్భుతమైన మరియు తెలివైన వ్యూహం అని చెప్పవచ్చు.
ఇంతకుముందు ఈ సినిమా విడుదల తేదీకి ఒక రోజు ముందే పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శించారు. నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను లహరి ఫిలింస్ తో కలిసి చాయ్ బిస్కెట్ నిర్మించారు. ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా లాభాలను రాబట్టింది.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే లైబ్రేరియన్ గా పనిచేస్తూ ఔత్సాహిక రచయిత అయిన పద్మభూషణ్ (సుహాస్). అప్పు చేసి తన మొదటి నవల ‘తొలి అడుగు’ను ప్రచురించగా దాన్ని ఎవరూ గుర్తించరు. అయితే అకస్మాత్తుగా అతను మంచి రచయితగా పేరు పొంది అందరి చేతా మెచ్చుకోబడతాడు.
ట్విస్ట్ ఏంటంటే నిజానికి ఆ పుస్తకం పద్మభూషణ్ రాయలేదు. పద్మభూషణ్ తన కలంపేరుతో పుస్తకం ఎవరు రాశారో తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడు. ఇంతకీ ఆ రచయిత ఎవరు? పద్మభూషణ్ కు రచయిత దొరికాడా? పద్మభూషణ్ పేరును ఆ రచయిత ఎందుకు వాడాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలే మిగతా కథ.