తాజాగా వినిపిస్తున్న అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం దర్శకుడు వంశీ పైడిపల్లి సూపర్ స్టార్ రజినీకాంత్ తో సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనున్నారు. స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన తర్వాత దిల్ రాజు, వంశీ పైడిపల్లి రజినీకాంత్ ను కలిసే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అయితే ఈ వార్తలకు మిశ్రమ స్పందన వస్తుంది. వంశీ పైడిపల్లి సూపర్ స్టార్ రజినీకాంత్ ను మెప్పించగలరా అని తెలుగు, తమిళ సినీ ప్రేమికులు ఆలోచిస్తున్నారు.
దిల్ రాజు, వంశీ పైడిపల్లి ఇటీవల దళపతి విజయ్ తో కలిసి వారిసు సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి/పొంగల్ సీజన్ లో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి కూడా తెలిసిందే. వాస్తవానికి ఈ సినిమా తరువాత వంశీ – విజయ్ కాంబో రిపీట్ అవుతుందని గతంలో వార్తలు వచ్చాయి. కానీ విజయ్ తన తదుపరి చిత్రం దర్శకుడు అట్లీతో కలిసి పనిచేయాలని భావిస్తున్నారు. దాంతో వంశీ పైడిపల్లి రజినీకాంత్ వైపు రూటు మార్చి ఆయన కోసం ఒక అద్భుతమైన స్క్రిప్ట్ సిద్ధం చేయడం మొదలు పెట్టారట.
ఇదిలా ఉంటే దిల్ రాజు ఇతర భాషల్లోనూ తన పట్టును మరింత బలోపేతం చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఆ దిశగా ఆయన చేస్తున్న మరో ప్రయత్నమే ఈ సినిమా అని అంటున్నారు. జెర్సీ, హిట్ సినిమాల రీమేక్ లతో బాలీవుడ్ లో ఫెయిల్ కావడంతో ఆయన హిందీలో సినిమాలు చేయడం మానేసి దక్షిణాది సినిమాల పై దృష్టి పెట్టారు. ఇప్పటికే దళపతి విజయ్ తో ‘వారిసు’ చిత్రాన్ని నిర్మించిన ఆయన ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ తో ఈ కొత్త ప్రాజెక్టుకు సిద్ధం అవుతున్నారు.
ఈ ఏడాది చివర్లో ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. రజినీకాంత్ జైలర్ షూటింగ్ పూర్తి చేసుకుని ఈ ఏడాదే సినిమాను విడుదల చేయనున్నారు. జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తన 170వ సినిమాకు కూడా ఆయన సంతకం చేశారు. అన్నీ కుదిరితే రజినీకాంత్ తో దిల్ రాజు – వంశీ పైడిపల్లి సినిమా కూడా వచ్చే ఏడాది విడుదల కానుంది. అయితే దీని పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.