తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) మరియు యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ (ATFPG) గురువారం సినిమా OTT విడుదలకు సంబందించిన కొత్త నిబంధనలతో పాటు సినిమా నిర్మాణ వ్యయాన్ని నియంత్రించడానికి కార్యాచరణను ప్రకటించింది. ఆగస్టు నెల ప్రారంభంలో నిర్మాతల సంఘం సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పలు తెలుగు సినిమాల షూటింగ్‌లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.
ఓటిటి విడుదలకి థియేటర్ విడుదలకి మధ్య వ్యవధిని ఎనిమిది వారాలకు పొడిగించాలని నిర్ణయించుకున్నట్లు అగ్ర నిర్మాత దిల్ రాజు తెలిపారు. ఇక నుంచీ చిత్ర నిర్మాతలు అందరూ ఈ నియమానికి కట్టుబడి ఉంటారనీ, ఒప్పందాన్ని ఉల్లంఘించే ప్రశ్నే లేదని కూడా చెప్పారు. ఈ మేరకు ఇప్పటికే జరిగిన ఒప్పందాలను కూడా మార్చే ఆలోచనలో కూడా ఉన్నామని, ఒకవేళ అవసరమైతే కొత్త నిబందనలు వెంటనే అమలులోకి వచ్చే విధంగా షరతులను మారుస్తామని యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అధ్యక్షుడు దిల్ రాజు అన్నారు.
అలానే మల్టీప్లెక్స్‌లలో ఆహార, పానీయాల ధరలతో పాటు టిక్కెట్ ధరలను కూడా నియంత్రించాలని నిర్ణయం తీసుకున్నారు. గిల్డ్ సభ్యులు మల్టీప్లెక్స్‌లతో వారి ఆహార ధరల పై చర్చలు జరపడానికి ప్రయత్నిస్తుందని, అంతే కాక మల్టీప్లెక్స్‌ల నిర్వహణను అందుబాటు ధరలకు అందించాలని అభ్యర్థించినట్లు దిల్ రాజు చెప్పారు.
మొత్తంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మరియు TFCC పెరుగుతున్న నిర్మాణ వ్యయాలను తగ్గించడానికి అంగీకరించాయి. దాంతో పాటు నిర్ణీత బడ్జెట్‌లో షూటింగ్ కార్యకలాపాలను కొనసాగించాలని నిర్ణయించుకున్నాయి, అందువల్ల ఇక పై నిధులు లేదా వనరుల వృధా చేసేందుకు అవకాశం లేదని నిర్మాణ వ్యయాలను నియంత్రించే వారి ప్రయత్నాల పై నిర్మాత దిల్ రాజు చెప్పారు.
అయితే ఇంతకు ముందు కూడా ఇలాంటి నిర్ణయాలు, నిభందనలు తెలుగు సినీ నిర్మాతలు తీసుకున్నారు. కానీ అవేవీ కూడా అనుకున్న విధంగా అమలు జరగలేదు. సినిమా ఇండస్ట్రీలో అందరూ ఓకే తాటి పై ఉండాలి అన్నా, ఒకే నిర్ణయాన్ని పాటించాలన్నా అంత సులభం కాదు అయితే కరోనా తరువాత తెలుగు సినీ పరిశ్రమ బాగా ఇబ్బందులు ఎదురుకుని నిలదొక్కుకునే నేపథ్యంలో అందరూ క్రమ పద్ధతిలో కలిసి మెలిసి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి తెలుగు సినిమా నిర్మాతల గిల్డ్ తీసుకున్న కొత్త నిర్ణయాలు అనుకున్నట్లు అమలు చేస్తారని ఆశిద్దాం