పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీర మల్లు సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలైంది. అయితే అనూహ్యంగా షూటింగ్ దశలో రకరకాల ఎదురు దెబ్బలు తినాల్సి వచ్చింది. వివిధ కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ లెక్కలేనన్ని సార్లు వాయిదా పడింది. షూటింగ్ ఆలస్యం కావడంతో నిర్మాత ఏఎం రత్నం కూడా చాలా నష్టపోయారు. హరి హర వీర మల్లు సెట్స్ కోసం తీసుకున్న అప్పులకు కూడా నష్టపోయారని పలు వార్తలు వచ్చాయి.
నిజానికి పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా హరి హర వీర మల్లు. పవన్ కళ్యాణ్ ఇంత వరకూ పోషించని విభిన్నమైన పాత్రను ఎంచుకోవడం ఇదే తొలిసారి. ఈ సినిమా ఫస్ట్ లుక్ చూస్తేనే గత పవన్ కళ్యాణ్ సినిమాలకు భిన్నంగా ఉండబోతోందని స్పష్టంగా అర్ధం అవుతుంది.
అయితే ఏ ముహూర్తంలో మొదలుపెట్టారో కానీ ఈ సినిమా షూటింగ్ దశలో అనేక సమస్యలతో సతమతమవుతోంది. ఏప్రిల్‌లో ఈ సినిమా షూటింగ్ మరోసారి ప్రారంభం కావాల్సి ఉండగా అదీ వాయిదా పడింది. తర్వాత మళ్లీ మరో తేదీకి వాయిదా పడింది. ఒకానొక సమయంలో, అసలు ఈ సినిమా ఆగిపోతుందని కూడా పుకార్లు వచ్చాయి. కానీ తాజాగా ఆగస్టు రెండో వారం నుండి షూటింగ్ ప్రారంభించాలని చిత్ర బృందం నిర్ణయించిందని సమాచారం వచ్చింది.
అయితే ఇప్పుడు ఆగస్టు మూడో వారం కూడా వచ్చేసింది కానీ చిత్ర బృందం నుండి షూటింగ్ గూర్చి కానీ ఎప్పుడు మొదలవుతుందనీ ఏ రకమైన సంకేతాలు రాలేదు. సెప్టెంబర్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుందని ఇప్పుడు మరోసారి వార్తలు వస్తున్నాయి, మరి ఈసారి అయినా ఆ వార్తలు నిజం అవుతాయో లేదో చూడాలి.
ఈ షెడ్యూల్ సరిగా అమలు జరిగేలా దర్శకుడు క్రిష్ తన శక్తి మేరకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ షెడ్యూల్‌లోనే పవన్ కళ్యాణ్‌కి సంబంధించిన పోర్షన్ మొత్తం పూర్తి చేయాలని ఆయన భావిస్తున్నారు. ఒక రకంగా చూసుకుంటే మొత్తం చిత్ర బృందానికి చావో రేవో తేలే షెడ్యూల్ గా మారిందని చెప్పచ్చు. వారి ఆశలు, ప్రయత్నాలు అన్నీ సరిగ్గా కుదిరి సినిమా షూటింగ్ ఏ అడ్డంకులు లేకుండా జరగాలని కోరుకుందాం.