పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే ఎనర్జీకి పెట్టింది పేరు. హీరోయిన్ తో రొమాన్స్, కామెడీ, డాన్స్, ఫిట్స్ ఇలా అన్నిట్లో తనదైన స్టైల్ మరియు ఎనర్జీని అందిస్తుంటారు పవన్. అయన నుంచి అభిమానులైనా, ప్రేక్షకులైనా ఆశించేవి అలాంటి పాత్రలు, సినిమాలే. అలాంటి పవన కళ్యాణ్, తన కెరీర్ లోనే మొట్ట మొదటిసారి ఒక చారిత్రాత్మక నేపథ్యంతో కూడిన హరిహర వీరమల్లు సినిమా చేయబోతున్నారు అని తెలిసినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఇక అభిమానులు అయితే ఇందులో హీరో ఒక దొంగ పాత్రలో, అలాంటిచారిత్రాత్మక నేపథ్యం లో నటిస్తున్నారు అనగానే పైరేట్స్ ఆఫ్ కారెబ్బీయన్ లోని జాక్ స్పారో తరహాలో ఒక ప్రత్యేకమైన పాత్రగా ఉంటుందని భారీ అంచనాలు పెట్టేసుకున్నారు.
ఇక దర్శకుడు క్రిష్ ఇది వరకే ఇలాంటి నేపథ్యంలోనే గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాను తెరకెక్కించిన అనుభవం ఉండటంతో.. ఖచ్చితంగా తమ హీరోతో కూడా అద్భుతమైన సినిమా తీస్తాడని పవర్ స్టార్ అభిమానులు ముందస్తు సంబరాలు చేసుకున్నారు. కానీ హరిహర వీరమల్లు సినిమా అసలు అనుకున్నట్లుగా తెరపైకి వస్తుందా లేదా అనేది ప్రస్తుతం అందరిలోనూ ఉన్న అనుమానం. షూటింగ్ మొదలు పెట్టినప్పుడే ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా సినిమా అని ప్రకటించారు. కానీ అందుకు తగ్గట్టుగా షూటింగ్ కానీ, చిత్ర ప్రచార కార్యక్రమాలు కానీ జరగటం లేదు.
మధ్యలో పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ ఆపేసి ఇతర సినిమాలకు ప్రాధాన్యతను ఇవ్వడం.. అలాగే స్క్రిప్ట్ విషయంలో కూడా పలు మార్పులు చేర్పులు చేసినట్లు వార్తలు రావడం.. అభిమానుల్లో సినిమా పట్ల ఒకింత అనిశ్చితికి దారి తీశాయి. అంతే కాక ఈ సినిమా విడుదల తేదీ విషయంలో కూడా చాలా మార్పులు జరిగాయి.
ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ ను మూడు సార్లు మార్చారు. గత ఏడాది వేసవికాలంలో రావాల్సిన సినిమా షూటింగ్ ఆలస్యం అవడంతో దసరాకు మార్చారు. ఆ తరువాత అదీ కాదు సంక్రాంతి 2023 అని అనధికారిక సమాచరం అందించారు. ఇక చివరిగా ఈ సినిమాను 2023 మార్చి 30వ తేదీన ఫ్యాన్ ఇండియా సినిమాగా విడుదల చేస్తున్నట్లు తెలియజేశారు. ఇక ఈ డేట్ కు కూడా సినిమా వస్తుందా రాదా అనే అనుమానం అటు అభిమానుల్లో ఇటు ప్రేక్షకుల్లో కూడా వ్యక్తం అవుతుంది. కాగా వేసవిలో మొదటి పెద్ద సినిమాగా ఆరోజు విడుదల అయితే ఖచ్చితంగా సినిమాకి బాక్స్ ఆఫీస్ వద్ద హెల్ప్ అవుతుంది అని కొందరు అభిమానులు అంటున్నారు.
2018లో రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా సరిగ్గా అదే డేట్ కి వచ్చి, బ్లాక్ బస్టర్ అవడమే కాక మెగా పవర్ స్టార్ కెరీర్ లోనే గుర్తుండిపోయే సినిమాగా నిలిచింది. హారిహర వీరమల్లు అనుకున్నట్లు మార్చి 30న వస్తే బాక్స్ ఆఫీస్ వద్ద అన్నదమ్ముల సవాల్ చూడచ్చు, ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా భోళా శంకర్ చిత్ర బృందం ఆ చిత్రాన్ని ఏప్రిల్ 14,2023న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.