అజిత్ నటించిన తునివు సినిమా ఇటీవలే ఓటీటీ ప్రీమియర్ అయిన తర్వాత విజయ్ అభిమానులు కూడా సంతోషించాల్సిన సమయం ఆసన్నమైంది. విజయ్ నటించిన వారిసు ఓటీటీ రిలీజ్ డేట్ ను చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఖరారు చేసింది. ఈ చిత్రం ఈ నెల 22 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. కాగా తెలుగు, తమిళ , మలయాళ భాషల్లో ఓటీటీలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
థియేట్రికల్ రన్ లో దాదాపు రూ.300 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం తమిళనాట ఘనవిజయం సాధించింది. తెలుగు రాష్ట్రాలు, ఇతర పొరుగు ప్రాంతాల్లో మరీ భారీ స్థాయిలో కలెక్షన్స్ నమోదు చేయలేకపోయిన ఈ చిత్రం ఓవర్సీస్ లో మాత్రం మంచి వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు అందరి చూపు వారిసు ఓటీటీ రిలీజ్ పైనే ఉంది.
అజిత్ నటించిన తునివుతో పాటు విడుదలైన వారిసు ఆసక్తికరమైన పొంగల్/సంక్రాంతి పోటీని ఎదుర్కొంది. 8 సంవత్సరాల తరువాత తమిళ అభిమానులు విజయ్ వర్సెస్ అజిత్ ఘర్షణను చూశారు మరియు రెండు చిత్రాలకూ తొలి రోజు మిశ్రమ సమీక్షలు వచ్చినప్పటికీ, అజిత్ మరియు విజయ్ యొక్క స్టార్ పవర్ పండగ సీజన్లో భారీ జన సందోహన్ని ఆకర్షించగలిగింది.
వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం పై దిల్ రాజు నిర్మించారు. రష్మిక మందన్న, శరత్ కుమార్, జయసుధ, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, శ్యామ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించారు.