తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం వారిసు 2023 పొంగల్ రేసులో నిలబడబోతుంది. కాగా ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ ఇటీవలే క్లోజ్ అయ్యింది, 140 కోట్ల భారీ మొత్తానికి ఈ సినిమా యొక్క థియేట్రికల్ బిజినెస్ డీల్స్ జరిగాయి.
దళపతి అని అభిమానుల చేత పిలిపించుకునే విజయ్ ప్రస్తుతం తన కెరీర్ లోనే అత్యద్భుతమైన స్టార్‌డమ్‌ను ఆస్వాదిస్తున్నారు. అందుకే వారిసు చిత్రానికి అన్ని ప్రాంతాల మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉంది. తెలుగు రాష్ట్రాలలో ఊహించని విధంగా 20 కోట్ల రేషియోలో బిజినెస్ జరగటం విశేషం.
ఇక తమిళనాడు థియేట్రికల్ రైట్స్ 70 కోట్లకు అమ్ముడయ్యాయి. అలాగే విజయ్ కు చెప్పుకోదగ్గ స్టార్ డమ్ ఉన్న కర్ణాటక మరియు కేరళ ఏరియాలు 7.5 కోట్లు మరియు 6.5 కోట్లకు అమ్ముడయ్యాయి. ఓవర్సీస్ హక్కులు 35 కోట్లకు అమ్ముడయ్యాయి.ఈ సినిమా ఓవరాల్ థియేట్రికల్ రైట్స్ 141 కోట్లకి జరుపుకుంది.
మొత్తంగా సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ప్రపంచ వ్యాప్తంగా 140 కోట్ల షేర్ కలెక్ట్ చేయాలి. నిజానికి ఇది చాలా భారీ నంబర్ అనిపించినా, దర్శకుడు వంశీ పైడిపల్లి తన కెరీర్ లో చాలా అరుదుగా ఫ్లాప్‌లను చూసి ఉన్నారు. ఆ రకంగా ఎక్కువ సక్సెస్‌రేట్‌ను కలిగి ఉన్న విజయవంతమైన దర్శకుడు కాబట్టి ఆ స్థాయిలో సినిమా విజయవంతం అవ్వడం అసాధ్యమేమీ కాదు.
గత 15 ఏళ్లుగా విజయ్ ప్రతి సినిమాతో తన మార్కెట్‌ను పెంచుకుంటూ పోతున్నారు. విజయ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్నాయి, ఆయన సినిమాలకు మినిమమ్ 200 కోట్లు లేదా 300 కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు.
తెలుగులోనూ ఆయన మార్కెట్ మెల్లగా పెరుగుతుండడం విశేషం. చివరిగా వచ్చిన ది బీస్ట్ సినిమా నిరాశ పరిచినా, దాని ముందు వచ్చిన మాస్టర్ తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్ రాబట్టింది.
ఈ భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుండగా, ఎస్ఎస్ తమన్ సంగీతం సమకూర్చనున్నారు. వారిసు కోలీవుడ్ మరియు టాలీవుడ్ పెద్ద సినిమాల నుండి విడుదల సమయంలో బలమైన పోటీని ఎదుర్కొంటుంది. అజిత్ తునివు, చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి కూడా సంక్రాంతి రేసులో ఉన్నాయి.