తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన యాక్షన్ డ్రామా వారిసు గత వారం పొంగల్/సంక్రాంతికి విడుదలై తమిళనాడు అంతటా అభిమానులను అలరించింది. అజిత్ నటించిన తునివు సినిమాకు పోటీగా విడుదలైన ఈ చిత్రం మొదటి వారంలో స్ట్రాంగ్ గా నిలదొక్కుకుని అన్ని చోట్లా మంచి కలెక్షన్లు నమోదు చేసింది. తొలి రోజు తునివు కంటే తమిళనాట తక్కువ వసూళ్లు వచ్చినా తర్వాతి రోజుల్లో ఈ చిత్రం గొప్పగా పుంజుకుంది.
ఇక ఈ చిత్రాన్ని వారసుడు టైటిల్ తో తెలుగు వెర్షన్ జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే దురదృష్టవశాత్తూ తమిళంలో సాధించిన విజయాన్ని తెలుగు వెర్షన్ తో కూడా రిపీట్ చేయలేకపోయారు.
విజయ్ నటించిన వారసుడు తమిళ వెర్షన్ స్థాయిలో ఇక్కడ విజయాన్ని అందుకోలేక ఖాళీ ధియేటర్లలో నడుస్తుంది. ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఆ తర్వాత బిజినెస్ ను కొన్ని తక్కువ ధరలకు సర్దుబాటు చేసిన ఈ సినిమా ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఏరియాల్లో జీఎస్టీ, తమిళ వెర్షన్ కలెక్షన్లతో కలిపి దాదాపు రూ.12 కోట్ల షేర్ వసూలు చేసింది.
తెలుగు వెర్షన్ షేర్ రూ.10 కోట్ల రేంజ్ లో ఉంటుందని ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు. గతంలో విజయ్ నటించిన మాస్టర్ సినిమా రూ.15 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఆ రకంగా చూసుకుంటే విజయ్ కు ఇది ఫ్లాప్ పెర్ఫామెన్స్ అని అంటున్నారు. దిల్ రాజు, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా పర్ఫార్మెన్స్ చాలా దారుణంగా ఉందని, దురదృష్టవశాత్తూ ముందుగా అనుకున్నట్టు విజయ్ కి వారసుడు సినిమాతో తెలుగులో మార్కెట్ పెరగలేదని అంటున్నారు.
ఈ చిత్రంలో విజయ్ సరసన రష్మిక మందన్న నటించగా.. శరత్ కుమార్, జయసుధ, శ్రీకాంత్, శ్యామ్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు.