తమిళ సూపర్ స్టార్, దళపతి విజయ్ మరో తెలుగు దర్శకుడితో సినిమా చేయబోతున్నారనే వార్త ఇటీవల సౌత్ ఇండియన్ సినిమా మీడియాలో హల్ చల్ చేసింది. విజయ్ చివరి చిత్రం వారిసును వంశీ పైడిపల్లి అనే తెలుగు దర్శకుడు తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు విజయ్ మరో తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేనితో సినిమా చేయబోతున్నారని అంటున్నారు.
గోపీచంద్ విజయ్ 68వ చిత్రంగా Thalapathy 68 అనే తాత్కాలిక టైటిల్ తో తెరకెక్కనున్న ఈ తదుపరి చిత్రాన్ని ప్రస్తుతం దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో లియో సినిమా చేసిన వెంటనే విజయ్ మొదలుపెడతారని వార్తలు వస్తుండగా, ఈ సినిమాను ఒకటి కాదు రెండు నిర్మాణ సంస్థలు నిర్మిస్తాయని కూడా సమాచారం అందుతోంది.
కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ఆర్బీ చౌదరికి చెందిన సూపర్ గుడ్ ఫిలిమ్స్ దళపతి 68 చిత్రాన్ని నిర్మించనుందట. ఆర్.బి.చౌదరి పెద్ద కుమారుడు నటుడు జితన్ రమేష్ ఇటీవల ఇదే విషయాన్ని ధృవీకరించారు. విజయ్ తమ బ్యానర్లో సినిమా చేయడం దాదాపు ఖాయమని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కూడా ‘దళపతి 68’ని కో ప్రొడ్యూసర్స్ గా నిర్మించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీని పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఏదేమైనా గోపీచంద్ మలినేని, విజయ్ కాంబినేషన్ చాలా ఆసక్తికరంగా ఉంటుందనే చెప్పాలి.
దర్శకుడు అట్లీ తన బాలీవుడ్ డెబ్యూగా షారుఖ్ ఖాన్ తో తెరకెక్కిస్తున్న జవాన్ లో విజయ్ అతిథి పాత్రకు కొనసాగింపుగా.. విజయ్ తో దళపతి 68 సినిమా ఉంటుందని మొదట వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు అట్లీ ప్రాజెక్ట్ విజయ్ 69వ చిత్రంగా రూపొందనుందని తెలుస్తోంది. సన్ పిక్చర్స్ ఈ సినిమాకి నిర్మాణ సంస్థగా వ్యవహరిస్తుండగా, అనిరుధ్ సంగీతం అందించనున్నారు.