రౌడి హీరో విజయ్ దేవరకొండ ఇప్పుడు తన సినిమాల ఎంపిక గురించి చాలా జాగర్తగా ఉంటున్నారు. మరియు భవిష్యత్తు కోసం దర్శకులతో ప్రత్యేకమైన కాంబినేషన్‌లను ప్రయత్నిస్తున్నారు. ఇటీవలే లైగర్ రూపంలో తన శైలికి సరిపడని ఒక కమర్షియల్ సినిమాను తీసే ప్రయత్నం చేయగా.. దాని ఫలితం ఆయనకు ఏమాత్రం అనుకూలంగా రాలేదు.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ.. యువ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమాలో సమంతతో కలిసి నటించనున్నారు. నిన్ను కోరి, మజిలీ వంటి సినిమాలతో ప్రేమకథలను తెరకెక్కించడంలో తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నారు శివ నిర్వాణ.
ఇక విజయ్, సమంతల క్రేజీ జోడీ కారణంగా ఈ సినిమా మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ ప్రాజెక్ట్ తర్వాత, విజయ్ శేఖర్ కమ్ములతో కలిసి పనిచేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్, నైజాం ఏరియాలో క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ కాంబో ఖచ్చితంగా అందరినీ ఆశ్చర్యపరుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. శేఖర్ కమ్ముల ప్రస్తుతం తమిళ హీరో ధనుష్ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు.
ధనుష్‌తో కమ్ముల ప్రాజెక్ట్ తెలుగు, తమిళం మరియు హిందీలో విడుదల కానుంది. SVC సినిమాస్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుంది మరియు ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అదే సమయంలో, శేఖర్ కమ్ముల తను 2010 లో తెరకెక్కించిన పొలిటికల్ డ్రామా లీడర్‌కి సీక్వెల్ కూడా తీస్తానని ఇంతకు ముందే ధృవీకరించారు. రానా దగ్గుబాటి లీడర్ 2 లో మొదటి భాగంలో చేసిన పాత్రనే తిరిగి పోషించనున్నారు.
విజయ్ దేవరకొండ విషయానికి వస్తే, ఈ యువ హీరో గౌతమ్ తిన్ననూరితో మరో ప్రాజెక్ట్ ను ఓకే చేసినట్లు సమాచారం. ఇంతకు ముందు రామ్ చరణ్ తప్పుకున్న ప్రాజెక్ట్ ఇదే అంటున్నారు.ఒక విజయ్ దేవరకొండ త్వరలో సుకుమార్‌తో కూడా జతకట్టనున్నారు. ఇలా విజయ్ చేతిలో చాలా ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లు వరుసగా ఉండటంతో, విజయ్ అభిమానులు ఇక తమ హీరో ఖచ్చితంగా మళ్ళీ విజయాల బాట పడతాడని ఉత్సాహంగా ఉన్నారు.