తెలుగు సినీ ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాలు కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న లైగర్ సినిమా విడుదలకు మరి కొద్ది రోజులే దూరం ఉంది. విజయ్ దేవరకొండ రెండేళ్ల గ్యాప్ తర్వాత సినిమా చేస్తుండటం వలన తన అభిమానులలో ఈ చిత్రం పట్ల అమితమైన ఆసక్తితో ఉన్నారు. ఎందుకంటే వారు విజయ్ దేవరకొండను వెండి తెర పై చూసి రెండేళ్లు దాటింది. విజయ్ దేవరకొండ చివరి చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్ ఫిబ్రవరి 14, 2020న విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చాలా ఘోరంగా డిజాస్టర్ గా నిలిచింది. అందువల్ల విజయ్ అభిమానులు ఒక భారీ విజయం కోసం ఎదురు చూస్తున్నారు. లైగర్ చిత్రం తమ ఆశలు నెరవేరుస్తుందనే నమ్మకంతో ఉన్నారు.
వారి ఆశలను నిజం చేసే దిశగానే లైగర్ చిత్రం అడుగులు వేస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం ప్రచార కార్యక్రమాలు జోరు మీద సాగి సినిమాపై హైప్ ను బాగా పెంచేశాయి. ఇక లైగర్ సినిమా అద్భుతమైన అడ్వాన్స్ బుకింగ్‌లను నమోదు చేస్తుంది. ఒక భారీ స్టార్ హీరోకు జరిగే స్థాయిలో ఈ చిత్రం టికెట్లు బుక్ అవుతున్నాయి , ఇంత భారీ స్థాయిలో లైగర్ సినిమా అడ్వాన్స్ బుకింగ్లు జరగడం మొత్తం పరిశ్రమను విస్మయానికి గురి చేస్తుంది.లైగర్‌కి ఇంత భారీ స్థాయిలో క్రేజ్ వస్తుందని బహుశా ఎవరూ ఊహించి ఉండరు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక వర్గం ఉత్తరాది ప్రేక్షకులు ఈ సినిమాను బాయ్కాట్ చేయాలి అంటూ సినిమా పై నెగిటివ్ టాక్ తేవాలని చూశారు. అయితే వారు కూడా ఈ సినిమా క్రేజ్ చూసి షాక్ అవుతున్నారు.
లైగర్ సినిమాకి ప్రీ-రిలీజ్ బిజినెస్ మంచి అధిక రేట్లకు జరిగింది. మరి ఓవర్సీస్ బుకింగ్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. దర్శకుడు పూరీ జగన్నాధ్ సినిమాలంటే ఓవర్సీస్ ప్రేక్షకులు సాధారణంగా అంత ఆసక్తి చూపించరు. అయితే ఈ సినిమాకి విజయ్ దేవరకొండ హీరో అవడం వల్ల, అక్కడ కూడా ప్రేక్షకులు ఈ సినిమా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. అందువల్లే టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. కాగా తెలుగు రాష్ట్రాల్లో కూడా లైగర్ సినిమా అద్భుతమైన బుకింగ్స్ ను నమోదు చేస్తుంది. విజయ్ దేవరకొండ కంచుకోట అయిన నైజాం ఏరియాలో కేవలం హైదరాబాద్ బుకింగ్స్ తోనే కోటి రూపాయల గ్రాస్ దాటడం విశేషం.
స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా అనన్య పాండే, మరియు తల్లిగా ముఖ్య పాత్రలో రమ్య కృష్ణన్ కూడా నటించారు. ఆగస్ట్ 25న విడుదల కానున్న ప్యాన్ ఇండియా చిత్రాన్ని కరణ్ జోహార్, పూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విజయ్ దేవరకొండ లైగర్ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, హిందీతో పాటు మలయాళంలో కూడా విడుదల కానుంది.