విసారణై, అసురన్, కాకా ముట్టై వంటి చిత్రాలను తెరకెక్కించిన తమిళ దర్శకుడు వెట్రిమారన్ జాతీయ అవార్డు గ్రహీతగా విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రాంతాలకు అతీతంగా ప్రేక్షకుల అభిమానాన్ని కూడా సంపాదించుకున్నారు. దక్షిణ భారత చలనచిత్ర రంగంలో సమర్థవంతమైన దర్శకులలో ఒకరిగా పరిగణించబడుతున్నారు. తమిళంలో ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం విడుతలై (పార్ట్ 1) మార్చి 31న విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది.
ఈ చిత్రం ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. రెండు వారాల తర్వాత ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల పార్ట్ 1 టైటిల్ తో డబ్ చేసి నిన్న విడుదల చేశారు. ఈ చిత్రంలో కమెడియన్ సూరి కథానాయకుడిగా, విజయ్ సేతుపతి రెండో ప్రధాన పాత్రలో నటించారు.
తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లతో ప్రారంభమైన ఈ చిత్రం తొలి రోజు కోటికి పైగా గ్రాస్ వసూలు చేసింది. అల్లు అరవింద్ చేతుల మీదుగా మంచి స్క్రీన్స్ లో రిలీజైన ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావటం కలెక్షన్స్ లో ప్రతిఫలిస్తోంది.
విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రల్లో క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన విడుతలై చిత్రం మార్చి 31న విడుదలై పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకుంది. వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రియలిస్టిక్ పోలీస్ వర్సెస్ నక్సల్ డ్రామాగా తెరకెక్కింది, ఇది పోలీసు శాఖలో సామాజిక మరియు రాజకీయ సమస్యలను కూడా హైలైట్ చేస్తుంది. ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో దర్శకుడు వెట్రిమారన్ ‘విడుతలై’ టీం మొత్తానికి ప్రశంసా చిహ్నంగా బంగారు నాణెం బహూకరించారు.
విడుతలై రెండవ భాగం సెప్టెంబర్ లో విడుదల కానుంది అని అంటున్నారు. ఈ చిత్రంలో సూరి, విజయ్ సేతుపతిలతో పాటు గౌతమ్ వాసుదేవ్ మీనన్, రాజీవ్ మీనన్, భవాని కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఇళయరాజా స్వరాలు సమకూర్చారు.