దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కించిన తాజా చిత్రం విడుతలై పార్ట్ 1 మార్చి 31న తమిళ భాషలో విడుదలై మంచి ఆదరణ పొందింది. ఏప్రిల్ 15న ఈ సినిమా తెలుగులో విడుదల కాబోతుంది. ఈ చిత్రానికి తెలుగు డబ్బింగ్ టైటిల్ విడుదల పార్ట్ 1. ఈ సినిమాలో సూరి, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను తెలుగులో గీతా ఆర్ట్స్ విడుదల చేయబోతోంది. ఇటీవలే వెట్రిమారన్, అల్లు అరవింద్ సహా చిత్ర నిర్మాతలు ఒక ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా టాలీవుడ్ స్టార్స్ మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లతో సినిమా చేసే ఆలోచన గురించి వెట్రిమారన్ ను ప్రశ్నించగా.. భవిష్యత్తులో వారితో కలిసి పనిచేసే ప్రణాళికలు ఉన్నాయని ఆయన హామీ ఇచ్చారు. తాను తీసిన ఆడుకలం సినిమా చూశాక అల్లు అర్జున్ ను కలిశానని చెప్పారు. కాగా అల్లు అర్జున్ వడ చెన్నై కోసం వెట్రిమారన్ ఒక పాత్రను తనకోసం వర్ణించడం విన్నారట. అయితే అది చివరికి వర్కౌట్ కాలేదు.
ఆ తర్వాత మహేష్ బాబుతో కూడా మాట్లాడినట్లు వెట్రిమారన్ తెలియజేశారు. మీరు తెలుగులో ఎవరితో కలిసి పనిచేయాలనుకుంటున్నారని అడిగినప్పుడు, వెట్రిమారన్ తాను ఖచ్చితంగా తెలుగు సినిమా చేస్తానని, కానీ అది ఎప్పుడు జరుగుతుందో తనకు ఖచ్చితంగా తెలియదని అన్నారు. అది మల్టీస్టారర్ అవుతుందో లేదో కూడా తెలియదని అన్నారు.
ఇటీవల ఓ సినిమా కోసం వెట్రిమారన్ ఎన్టీఆర్ ని సంప్రదించారు అన్న వార్తలు వచ్చాయి. తనతో ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తారనే వార్తలను వెట్రిమారన్ ధృవీకరించారు. అసురన్ సినిమా తర్వాత లాక్డౌన్ సమయంలో ఎన్టీఆర్ ను కలిశానని, మాట్లాడుకున్నామని చెప్పారు. కాస్త ఆలస్యంగా అయినా తప్పకుండా ఒక సినిమా తెలుగులో చేస్తావని ఆయన అన్నారు. కాగా ఎన్టీఆర్ మరియు వెట్రిమారన్ కాంబోలో రానున్న సినిమా రెండు భాగాలుగా విభజించనున్నారని, ఒక్కో సినిమాలో ప్రధాన పాత్రలో ఎన్టీఆర్, ధనుష్ నటించనున్నారని సమాచారం.