మైత్రీ మూవీ మేకర్స్ ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థగా అవతరించింది. కాగా ఈ సంస్థ 2023 సంక్రాంతికి రెండు భారీ సినిమాలను విడుదల చేస్తోంది. అందులో ఒకటి బాలయ్య నటిస్తున్న మాస్ ఫ్యాక్షన్ ఎంటర్టైనర్ వీరసింహా రెడ్డి కాగా.. మరొకటి మెగాస్టార్ చిరంజీవి నటిశ్రున్న పక్కా మాస్ మసాలా చిత్రం వాల్తేరు వీరయ్య.
సంక్రాంతికి ఖచ్చితంగా తమ సినిమాలను విడుదల చేయాలని ఇరు చిత్ర బృందాలు తహతహలాడాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఇద్దరి డిమాండ్లకు కట్టుబడి రెండు సినిమాలని సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఒకే బ్యానర్‌లో రెండు సినిమాలు ఒకే సీజన్‌లో విడుదల కావడం చాలా అరుదుగా జరుగుతోంది.
సంక్రాంతి అంటే రెండు భారీ సినిమాలకు సరిపోయే సీజన్ కావడంతో ఈ బ్యానర్‌కి పెద్దగా నష్టం ఉండదు. అయితే, పోటీ కేవలం సంక్రాంతికి విడుదల చేయాలనే దగ్గర ఆగలేదు. రెండు సినిమాల వర్గాలు కూడా ముందుగా తమ సినిమానే విడుదల కావాలని కోరుకున్నారు.
బెస్ట్ డేట్ కోసం జరుగుతున్న ఈ పోటీలో వీరసింహారెడ్డికి ఎంతగానో ఆశించిన తేదీ లభించినట్లు కనిపిస్తోంది. ఈ రెండు సినిమాల విడుదల తేదీలను మైత్రీ బ్యానర్ డిస్ట్రిబ్యూటర్లకు తెలియజేసిందని అంతర్గత వర్గాలు పేర్కొంటున్నాయి. బాలయ్య సినిమాకు జనవరి 12, మెగాస్టార్ సినిమాకు జనవరి 13 తేదీలను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
ఈ వార్త చిరంజీవి అభిమానులను కొంచెం కలవరపెడుతోంది. వీరయ్య సినిమాతో రికార్డులు బద్దలు కొడతామన్న నమ్మకంతో సోలో రిలీజ్ కావాలని వారు అనుకున్నారు. ఇప్పుడు ముందుగా విడుదల కావడం వల్ల ఓపెనింగ్ రోజు కలెక్షన్ల వరకూ వీరసింహారెడ్డికి అదనపు లాభం చేకూరుతుందని వారు భావిస్తున్నారు.
అయితే, గతంలో చాలా సినిమాలు సంక్రాంతి సీజన్‌లో ముందుగా విడుదలైన ఇతర సినిమాల కంటే ఎక్కువ కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.
రిలీజ్ డేట్ అనేది ఒక అడ్వాంటేజ్ మాత్రమే అవుతుంది కానీ అది సినిమా ఫలితాన్ని నిర్ణయించలేదు. లేట్ రిలీజ్ అయితే తొలి రోజు వసూళ్లలో కాస్త వెనక ఉండవచ్చు, కానీ పూర్తి రన్ కంటెంట్‌పై మాత్రమే ఆధారపడి ఉంటుంది. అలా వైకుంఠపురంలో సినిమా ఘనవిజయం ద్వారా ఇది నిరూపించబడింది. ఆ సినిమా సరిలేరు నీకెవ్వరు తర్వాత విడుదలైంది. కానీ ఫుల్ రన్‌లో ఆ సినిమానే ఎక్కువ కలెక్షన్లను సాధించింది. కాబట్టి, మెగా అభిమానులు ఈ విషయంలో ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు.