ప్రతి వారం అనేక సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండటంతో తెలుగు ప్రేక్షకులు వేసవిలో బిగ్ స్క్రీన్ల పై ఉత్తమ వినోదాన్ని చూసి ఆనందిస్తున్నారు. అలాగే ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా థియేట్రికల్ రిలీజ్ లతో పోటీ పడటంలో ఎలాంటి వెనకడుగు వేయడం లేదు. అదే ట్రెండ్ ప్రకారం ఈ రోజు రాత్రి నుంచి రెండు తెలుగు సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి. ఆ సినిమాలు దసరా, సేవ్ ది టైగర్స్.
గతంలో పాఠశాల, ఆనందో బ్రహ్మ, యాత్ర (వైఎస్ఆర్ బయోపిక్) వంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు మహి వి రాఘవ్ డిజిటల్ అరంగేట్రంతో కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య కృష్ణ ప్రధాన పాత్రల్లో తన నిర్మాణ సంస్థ త్రీ ఆరమ్ లీవ్స్ బ్యానర్ పై సేవ్ ది టైగర్స్ పేరుతో కొత్త వెబ్ సిరీస్ ను రూపొందించారు. ఈ సిరీస్ ఈ రోజు రాత్రి నుంచి డిస్నీ+ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
మహి వి రాఘవ్, ప్రదీప్ అద్వైతం రూపొందించిన ఈ షోకు ప్రముఖ నటుడు తేజ కాకుమాను దర్శకత్వం వహించారు. గతంలో బిల్లా రంగా, మైనే ప్యార్ కియా వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రదీప్ అద్వైతం ‘సేవ్ ది టైగర్స్’కు కథ అందించారు. సుజాత, పావని గంగిరెడ్డి, దేవయాని, గంగవ్వ, హర్షవర్ధన్, వేణు టిల్లు (యెల్దండి), రోహిణి, సద్దాం, సునయన ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
ఈ రోజు రాత్రి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న మరో సినిమా నాని దసరా. ఇటీవలే థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను థియేటర్స్ లో మిస్సయిన వారు ఈ రాత్రి నుంచి నెట్ ఫ్లిక్స్ లో వీక్షించవచ్చు. తెలుగు, తమిళ , కన్నడ , మలయాళ భాషల్లో ఈ చిత్రం ప్రసారం కానుంది.
కీర్తి సురేష్, దీక్షిత్ శెట్టిల సహజ నటనతో దసరాలో నాని సూపర్బ్ పెర్ఫార్మెన్స్ కు మంచి సపోర్ట్ లభించింది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల గ్రామీణ తెలంగాణను సహజంగా చిత్రీకరించడంతో పాటు, ఎమోషనల్, యాక్షన్ సీక్వెన్స్ లు సినిమాకు హైలైట్ గా నిలిచాయి.