కరోనా వరుస దాడులతో కాస్త ఇరుకున పడ్డ తెలుగు సినిమా పరిశ్రమ మరియు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ మార్కెట్ కూడా మెల్లమెల్లగా పుంజుకుంటున్నా, OTT మార్కెట్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఎందుకంటే మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా అందరూ మారాల్సిన అవసరం ఎంతయినా ఉంది. అందుకే ఇప్పుడు ధియేటర్లలో విడుదల అవుతున్న సినిమాలతో పాటు అక్కడ సరిగ్గా ఆడే అవకాశం లేని కాస్త విభిన్నమైన ప్రయత్నాలు ఓటిటీలో విడుదల అవుతున్నాయి.
అందువల్ల ప్రేక్షకులకు అన్ని రకాల వినోద అంశాలు అందుతుంది.ఆరోగ్యకరమైన వాతావరణంలో అటు ధియేటర్ల వ్యవస్థ, ఇటు ఓటిటి వ్యవస్థ రెండూ కలిసి ముందుకి వెళ్లడం అనేది చాలా మంచిది. ప్రతి సంవత్సరం లెక్కలేనన్ని సినిమాలు వస్తుంటాయి, అలాంటప్పుడు ప్రతి సినిమాను థియేటర్లలో విడుదల చేయలేరు కదా. వెండి తెరపైకి రాలేని కొన్ని సినిమాలు ఇప్పుడు చిన్న తెరపై అంటే ఓటిటిలలో విడుదలై పేరు తెచ్చుకుంటున్నాయి.ఈ క్రమంలో రెండు కొత్త తెలుగు సినిమాలు ఇప్పుడు నేరుగా ఓటిటిలో ప్రసారం అవుతున్నాయి.
అందులో మొదటి సినిమా పెళ్లికూతురు పార్టీ.. అపర్ణ మల్లాది రచించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా కథ, తన అక్క పెళ్లి నాశనం చేయడానికి ప్రయత్నించే ఒక చెల్లెలు గురించి హాస్యం జోడించి చెప్పే ఒక హాస్య చిత్రం. ఆమెకు ఆ పనిలో అమ్మమ్మ కూడా సహాయం చేస్తుంది. ఈ కథ ప్రేక్షకులని కడుపుబ్బా నవ్విస్తుంది. పెళ్లికూతురు పార్టీ సినిమా ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో చక్కని స్పందన తెచ్చుకుంది. అలాగే చాలా మంది హృదయాలను గెలిచి ప్రశంసలు అందుకుంటున్నది. ప్రస్తుతం ఈ సినిమా ఆహా తెలుగులో ప్రసారం అవుతోంది.
ఇక ఈ వారం ప్రేక్షకుల ముందుకి వచ్చిన మరో సినిమా పంచతంత్ర కథలు. పెళ్లికూతురు పార్టీ చిత్రంతో పోలిస్తే పంచతంత్ర కథలు ఎక్కువగా ప్రాచుర్యం పొందలేదు. ఈ సినిమాకు గంగనమోని శేఖర్ రచనతో పాటు దర్శకత్వం కూడా వహించారు, ఈ చిత్రం సామాజిక సమస్యలను, వాటి పరిష్కారాల గురించి చర్చించే 5 కథల సమూహం. కులం విలువ, సెక్స్, వ్యభిచారం, స్వేచ్ఛ మరియు ప్రేమ అంశాల చుట్టూ తిరుగుతుంది. కేర్ ఆఫ్ కంచరపాలెం స్టైల్‌లో వేరు వేరు కథలతో ఒక సినిమాగా పంచతంత్ర కథలు సినిమాని చిత్రీకరించారు. ఈ సినిమా కూడా ఆహా తెలుగులోనే ప్రసారం అవుతోంది.