రచయిత/దర్శకుడు త్రివిక్రమ్ తన అద్భుతమైన సంగీత అభిరుచికి పేరుగాంచారు, కాగా ఆయన తన సినిమాల్లోని తన పాటలలోని లిరిక్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. తన కెరీర్ మొత్తంలో గొప్ప ఆడియో లేని సినిమా ఏదీ లేదు. ఆయన ట్రాక్ రికార్డ్ ఎంత గొప్పది అని తెలుసుకోవడానికి ఈ ఒక్క విషయం చాలు.
అరవింద సమేత, అల వైకుంఠపురములో చిత్రాలతో త్రివిక్రమ్ తో కలిసి పని చేసిన థమన్ తన బెస్ట్ వర్క్ అందించారు. అల వైకుంఠపురములో సినిమాకి బ్లాక్ బస్టర్ ఆల్బమ్ అందించిన విషయం తెలిసిందే. ఇక అరవింద సమేత సినిమాలో అంత గొప్ప ఆల్బమ్ లేకపోయినా థమన్ అందించిన నేపథ్య సంగీతానికి ప్రశంసలు దక్కాయి. కాబట్టి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయబోతున్న ఈ కాంబో నుంచి ప్రేక్షకులు ఎక్కువ ఆశించడం సహజమే.
అయితే తాజాగా SSMB 28 గురించి వస్తున్న వార్తలను నమ్మితే త్రివిక్రమ్, థమన్ ల మధ్య సమన్వయం సరిగ్గా కుదరలేదని తెలుస్తోంది. ఫిబ్రవరి మొదటి వారంలో ఓ సాంగ్ షూట్ చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేసినా థమన్ ట్యూన్ నచ్చని త్రివిక్రమ్.. మ్యూజిక్ పై మళ్ళీ పని చేయమని థమన్ కు సూచించారట.
దీంతో సాంగ్ షూట్ వాయిదా పడింది. త్రివిక్రమ్ తన సినిమాల్లో పాటల విషయంలో చాలా ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తారు. పైన చెప్పినట్లు తన సినిమాల్లోని పాటల పై అంచనాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి సంగీతం విషయంలో కాంప్రమైజ్ అయ్యే మూడ్ లో ఆయన లేరు.
టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో మహేష్ బాబు నటిస్తున్న SSMB28 ఒకటి. దాదాపు 12 ఏళ్ల తర్వాత త్రివిక్రమ్, మహేష్ కలయికలో వస్తున్న ఈ సినిమా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు.
మహర్షి తర్వాత మహేష్ బాబు సరసన పూజా హెగ్డే రెండోసారి నటిస్తుండగా, మిగతా తారాగణం వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తుండగా, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇదిలా ఉండగా ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తారని గతంలో చాలా రూమర్స్ వచ్చాయి కానీ నిర్మాత నాగవంశీ ఇటీవలి కాలంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ తెలుగు సినిమాగా తెరకెక్కుతుంది అని క్లారిటీ ఇచ్చారు.