ఈ ఏడాది సెలబ్రిటీ ఛాంపియన్ లీగ్ (CCL) తెలుగు వారియర్స్ మరియు భోజ్‌పురి దబాంగ్స్ మధ్య నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్‌తో ముగిసింది. ఫైనల్లో అఖిల్ అక్కినేని సారథ్యంలోని తెలుగు వారియర్స్ ఘన విజయం సాధించింది. ఇప్పటి వరకు జరిగిన తొమ్మిది సీజన్లలో ఇది తెలుగు వారియర్స్ సాధించిన నాలుగో విజయం కావడం విశేషం.
అఖిల్ అక్కినేని, అశ్విన్ బాబు, థమన్, రఘులు భోజ్‌పురి దబాంగ్స్ పై అద్భుతంగా ఆడి తమ జట్టును గెలిపించారు. వెంకటేష్ లాంటి హీరోలు, గంటా శ్రీనివాసరావు వంటి ప్రముఖులు ఫైనల్ జరుగుతున్న సమయంలో స్టేడియంకు వచ్చి తెలుగు వారియర్స్ టీమ్ ను ఉత్సాహపరిచారు.
ఇదిలా ఉంటే, ఈ సీజన్‌లో అఖిల్ మూడుసార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్‌ను కూడా గెలుచుకోవడంతో తన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది టోర్నీలో అత్యధిక సిక్సర్లు కొట్టడమే కాకుండా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా అఖిల్ నిలిచారు.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ఏజెంట్ సినిమాలో అఖిల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో అఖిల్ సరసన హీరోయిన్ గా సాక్షి వైద్య నటిస్తుండగా, మలయాళ స్టార్ మమ్ముట్టి ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమా సెకండ్ సింగిల్ సాంగ్ ను ఇటీవలే విడుదల చేసారు.