తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న సమస్యల దృష్ట్యా నిర్మాతల మండలి ఆగస్ట్ మొదటి తారీఖు నుంచి షూటింగులను ఆపేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నిర్మాతల మండలి ప్రకటించిన షూటింగ్ సమ్మెను విరమించారని తెలుస్తోంది. కొన్ని వారాల క్రితం ఆగిపోయిన సినిమా షూటింగ్‌లు ఇప్పుడు తక్షణం అమలులోకి రానున్నాయి.
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు, నిర్మాతల మండలి ఇటీవల తీసుకున్న కొన్ని నిర్ణయాలు వివాదానికి దారి తీశాయి. స్టార్ హీరోలు మరియు దర్శకుల పారితోషికాలను లక్ష్యంగా చేసుకుని వాటి పై నియంత్రణ తేవాలని నిర్మాతల మండలి ప్రయత్నించింది. గత నెలలో వరుస ఫ్లాప్‌లతో తెలుగు సినీ పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్ళిపోతున్న దశలో ఈ ప్రకటన చేయబడింది.
అయితే నిర్మాతల మండలి చేసిన ప్రయత్నాల్ని స్టార్ హీరోలు మరియు స్టార్ డైరెక్టర్లు ఏమాత్రం ఇష్ట పడలేదు. సినిమాల పరాజయాల కారణంగా తమ రెమ్యూనరేషన్లను తగ్గించుకోబోము అనే ఆలోచన లోనే వారు ఉన్నారు. తమ స్టార్ డం తో సినిమాలు విజయవంతం అవుతున్నాయని, అంతే కాక తమ బ్రాండ్ వాల్యూతో ప్రేక్షకులను థియేటర్ వద్దకు లాగగలుగుతున్నారని భావిస్తున్నారు.
అశ్విని దత్, బండ్ల గణేష్ వంటి నిర్మాతలు ఈ సందర్భంగా దిల్ రాజుకు వ్యతిరేకంగా బహిరంగంగా ప్రకటనలు చేశారు. ఎందుకంటే తెలుగు సినీ నిర్మాతల గిల్డ్ నిర్ణయాలలో ముఖ్య పాత్ర పోషిస్తున్నది దిల్ రాజు కాబట్టి. ఈ మేరకు తన సినిమాల షూటింగ్‌లను ఆపేది లేదని అశ్వినీదత్ ఇదివరకు స్పష్టం చేశారు. “మా ప్రొడక్షన్స్ దిల్ రాజు నిబంధనలలో భాగం కావు. మేము మా షూటింగ్ కొనసాగిస్తాము” అన్నారాయన.
అయితే విచిత్రంగా ఏ ఆగస్టు నుంచి షూటింగులు బంద్ చేశారో.. అదే నెలలో టాలీవుడ్ తిరిగి పూర్వ వైభవాన్ని అందుకోవడం విశేషం. రెండు వారాల్లో బింబిసార, సీతా రామం, కార్తికేయ 2 రూపంలో మూడు సూపర్ హిట్‌లు రావడంతో సినిమాలో సరైన విషయం ఉంటే చాలు ప్రేక్షకులు ఆదరిస్తారని తేలిపోయిందని, రెమ్యునరేషన్‌లు లేదా ఓటిటిలను బూచిగా చూపే అవసరం లేదని తేలిపోయింది.
థాంక్యూ, పక్కా కమర్షియల్, ది వారియర్ మరియు రామారావు ఆన్ డ్యూటీ వంటి సినిమాలు ఫ్లాప్ అవడానికి కారణం ఆ సినిమాల్లో సరైన కంటెంట్ లేనందు వల్లే కానీ మరే కారణం చేత కాదు. అదే విధంగా ఈ మధ్య వచ్చిన హిట్ సినిమాలు కొత్తదనంతో పాటు ఏదో ఒక ఆసక్తికరమైన అంశాలను అందించి భారీ కలెక్షన్లను రాబడుతున్నాయి. ఇదే ఇప్పుడు సక్సెస్ ఫార్ములా.