వరుసగా సినిమాలకు వస్తున్న చేదు ఫలితాలతో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత నెలలో విడుదలైన ధనుష్ సార్ సినిమా తర్వాత చాలా చిన్న సినిమాలు రిలీజైనా అందులో వేణు యేల్దండి దర్శకత్వం వహించిన బలగం మినహా మరే సినిమా కూడా పెద్దగా ఆడలేదు. బలగం సినిమా కూడా నైజాం ఏరియాలో మాత్రమే బాగా ఆడుతోంది. పెద్ద సినిమాలన్నీ సంక్రాంతి లేదా సమ్మర్ ని టార్గెట్ చేయడంతో ఫిబ్రవరి – మార్చిలో చెప్పుకోదగ్గ సినిమాలేవీ విడుదల కాలేదు.
దీంతో చాలా మంది థియేటర్ల యజమానులు సినిమాలను ప్రదర్శించలేక, కొన్ని పాత సినిమాలను ప్రదర్శిస్తున్నారు. అటు కొత్త రిలీజ్ లు వరుసగా ఫెయిల్ అవుతుండటం ఇటు పాత సినిమాల విడుదలలు కూడా పెద్దగా లాభం తేకపోవటంతో వచ్చే వారంలో విడుదలయ్యే సినిమాల పై థియేటర్ల యజమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
వచ్చే వారం రెండు సినిమాలు తెలుగు బాక్సాఫీస్ వద్ద విడుదలవుతున్నాయి. ఒకటి కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటించిన కబ్జా, మరొకటి నాగశౌర్య నటించిన ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి. ఈ రెండు సినిమాలు ఇప్పటికీ ఎలాంటి బజ్ క్రియేట్ చేయకపోవడం థియేటర్ల యజమానులను కలవరపెడుతోంది. అయితే టాక్ బాగుంటే ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది.
ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి చిత్రం నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో దాసరి ప్రొడక్షన్స్ తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన రొమాంటిక్ డ్రామా. ఈ సినిమా మార్చి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. కళ్యాణి మాలిక్ స్వరపరిచిన ఈ చిత్రంలోని పాటలను ప్రేక్షకులు ఇప్పటికే బాగా ఆదరించారు.
ఇక కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటించిన ‘కబ్జా’ చిత్రం 1945 బ్రిటీష్ రాజ్ నేపథ్యంలో తెరకెక్కింది. ఆర్.చంద్రు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎయిర్ఫోర్స్ సైనికుడి కథగా రూపొందింది. మాఫియా ప్రపంచాన్ని శాసించడానికి వచ్చిన స్వాతంత్ర్య సమరయోధుడి కుమారుడుగా ఉపేంద్ర కనిపించనున్నారు. పునీత్ రాజ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా 2023 మార్చి 17న విడుదల కానున్న ఈ చిత్రం కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం, హిందీ, బెంగాలీ, ఒడియా సహా ఏడు భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.