గత కొద్ది రోజులుగా పెద్ద సినిమాలన్నీ విడుదల అయిపోవడంతో చిన్న సినిమాలన్నీ ఇప్పుడు రిలీజ్ కోసం క్యూ కట్టాయి. ఈ వారం మూడు చిన్న సినిమాలు తెలుగు వెండి తార మీద సందడి చేయడానికి వచ్చాయి. ఈ వారం విడుదలైన మూడు సినిమాల మీద విడుదలకు ముందు మంచి బజ్ ఏర్పడింది. సుధీర్ బాబు హీరోగా కృతి శెట్టి హీరోయిన్గా నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమా సెప్టెంబర్ 16వ తేదీన విడుదల అయిన సినిమాల్లో మొదటిది.
మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నప్పటికీ.. ఆ అంచనాలను అందుకోవడంలో సినిమా విఫలమయింది. అక్కడక్కడా కొన్ని మంచి సన్నివేశాలు తప్ప ఏమాత్రం బాగోలేదని సినిమా చూసిన ప్రేక్షకులు పెదవి విరిచారు.
ఇక రెండో చిత్రం యువ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన నేను మీకు బాగా కావాల్సిన వాడిని. శ్రీధర్ గదే దర్శకత్వంలో ఈ సినిమాను కోడి రామకృష్ణ కుమార్తె కోడి దివ్య దీప్తి తన సొంత నిర్మాణ సంస్థ నిర్మాణంలో నిర్మించారు. కిరణ్ అబ్బవరం వరుస విజయాల బాటలో వచ్చిన ఈ చిత్రం మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ అవుతుందని ప్రేక్షకులు ఆశించారు.
అయితే సినిమా మరీ మూస ధోరణిలో ఉండటం వలన ప్రేక్షకులను అసలు ఆకట్టుకోలేకపోయింది. కేవలం కొన్ని కామెడీ సన్నివేశాలు, మణిశర్మ అందించిన పాటలు మినహా సినిమాలో చెప్పుకోవడానికి ఏమీ లేదని సినిమా చూసిన అందరూ అభిప్రాయపడ్డారు. నిజానికి సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన విడుదల కావాల్సిన ఈ సినిమా ఒక వారం వాయిదా పడింది.
ఇక ఈ రెండు సినిమాలు కాకుండా శాకిని డాకిని అనే సినిమా కూడా 16వ తేదీన విడుదలయింది. నివేదా థామస్, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రలలో రూపొందిన ఈ సినిమాను దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కించారు. సురేష్ ప్రొడక్షన్స్ తో కలిసి సునీత తాటి అనే నిర్మాత ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం కొరియన్ సినిమా ” మిడ్నైట్ రన్నర్స్” అధికారిక రీమేక్ గా రుపొందించబడింది. చక్కని క్రైమ్ కామెడీ అయ్యే అన్ని లక్షణాలు ఉన్నా కూడా మరీ నత్తనడకన సాగిన కథనం వల్ల సినిమాలో ఉండాల్సిన బిగి లేకుండా పోయిందని, ఇదే సినిమా OTTlo విడుదలై ఉంటే బాగుండేదని కొందరు ప్రేక్షకులు అనడం కొసమెరుపు.
ఆ రకంగా నెగటివ్ టాక్ మరియు పేలవమైన రివ్యూలను తెచ్చుకున్న ఈ మూడు సినిమాలూ బాక్స్ ఆఫీస్ వద్ద తొలి రోజే డిజాస్టర్లుగా నిలిచాయి. కనీస స్థాయిలో కూడా ఓపెనింగ్స్ దక్కించుకోలేకపోవడమే కాకుండా చాలా ఏరియాలలో థియేటర్ రెంట్ కూడా వసూలు చేయలేనంత దారుణంగా ఈ సినిమాల కలెక్షన్లు ఉండటం గమనార్హం.