మొబైల్ నెట్ వర్క్ లలో అధిక ఇంటర్నెట్ వేగం అభివృద్ధి చెందడం మరియు వార్తలను తొందరగా చేయడానికి డిజిటల్ మీడియలో కొందరు ఉత్సాహం చూపించడం ఎక్కువయింది. తద్వారా కొంతమంది ఫేక్ వార్తలను వ్యాప్తి చేయడం ఈ రోజుల్లో పరిపాటిగా మారింది. వేణుమాధవ్ (Late) వంటి ప్రముఖ తెలుగు నటులు కూడా మీడియా ముందుకు వచ్చి తాము కోలుకుంటున్న సమయంలో బ్రేకింగ్ న్యూస్ ద్వారా చంపేసినందుకు విచారం వ్యక్తం చేయగా, ఈ మధ్య కాలంలో మరికొంత మంది సెలబ్రిటీలు కూడా ఈ పరిస్థితిని ఎదుర్కొన్నారు.
తాజాగా హైదరాబాద్ లో ఇలాంటి ఘటనే మరొకటి వెలుగుచూసింది. ఆరోగ్యంగా ఉన్న కోట శ్రీనివాసరావును స్థానిక మీడియా విభాగం సోషల్ మీడియాలో చనిపోయారు అంటూ ఫేక్ న్యూస్ ప్రసారం చేసింది. తన మరణం పై కొందరు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని, అయితే తాను ఆరోగ్యంగా, సజీవంగా ఉన్నానని ఈ ప్రముఖ సినీ నటుడు ఆవేదన వ్యక్తం చేశారు.
తాను సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నానని, పైన ఉదాహరించిన తప్పుడు వార్తలను నమ్మవద్దని మీడియాను, అభిమానులను కోరిన ఆయన ఇదే విషయాన్ని వ్యక్తపరుస్తూ ఓ వీడియో బైట్ ను ప్రచురించారు. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారు ప్రజల జీవితాలతో చెలగాటం ఆడొద్దని చెప్తూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
అంతే కాకుండా, ఈ ఫేక్ న్యూస్ బయటకు వచ్చిన తరువాత ఈ రోజు ఉదయం నుంచి 50 మందికి పైగా శ్రేయోభిలాషులు తన ఆరోగ్యం గురించి ఆరా తీశారని, కొంతమంది పోలీసు అధికారులు కూడా జనాన్ని నియంత్రించడానికి తన ఇంటికి వచ్చారని ఆయన చెప్పారు. అంతే కాదు, డబ్బు సంపాదించడానికి అనేక ఇతర మార్గాలు ఉన్నందున ఇలాంటి ఫేక్ వార్తలను వ్యాప్తి చేయవద్దని ఆయన ప్రజలను కోరారు.