దేవి శ్రీ ప్రసాద్ మరియు థమన్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్ర సంగీత దర్శకులుగా వెలుగుతున్న సంగతి తెలిసిందే. వీరి మధ్య ఉన్న పోటీ కారణంగా వీరిద్దరూ అప్రకటిత ప్రత్యర్థులుగా చూడబడతారు. వ్యక్తిగతంగా తమ మధ్య మంచి సంబంధాలున్నప్పటికీ, పోటీని స్పోర్టివ్‌గా తీసుకుంటామని థమన్ చాలాసార్లు స్పష్టం చేశారు.
ఇప్పుడు సంక్రాంతి-2023కి వాల్తేరు వీరయ్య మరియు వీరసింహా రెడ్డి సినిమాల ద్వారా వీరిద్దరూ పోటీ పడబోతున్నారు. అందువల్ల ఇద్దరు హీరోల అభిమానులు ఈ ఇద్దరు సంగీత దర్శకుల పనిని పోల్చి చూస్తున్నారు.
2020 జనవరిలో థమన్ సంగీత దర్శకత్వం వహించిన అల వైకుంటపురములో మరియు దేవీ శ్రీ ప్రసాద్ స్వరపరిచిన సరిలేరు నీకెవ్వరు చిత్రాలు విడుదలయ్యాయి.ఆ సమయంలో వీరి పాటల పై భారీ పోలికలు వచ్చాయి మరియు చివరకు థమన్ DSP కంటే ఎక్కువగా మార్కులు స్కోర్ చేశారు.
సరిలేరు నీకెవ్వరు సినిమాలో కొన్ని పాటలు వైరల్ అయి సూపర్ హిట్ అయిన్నప్పటికీ, చివరికి అల వైకుంట పురంలో పాటలు సరిలేరు నీకెవ్వరు పాటల కంటే బాగా ప్రాచుర్యం పొందాయి.
ఇక ప్రస్తుతానికి వచ్చేసరికి వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యల పోటీ కారణంగా అభిమానులు ప్రతి ప్రమోషనల్ కంటెంట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సినిమా ప్రోమోలు, పాటలు అన్నిటినీ పోల్చి చూస్తున్నారు.
ఇప్పుడు పోటీ బాలకృష్ణ-చిరంజీవిల మధ్య కాకుండా దేవి, థమన్ మధ్యనే కనిపిస్తోంది. ఇది వారి పై విపరీతమైన ఒత్తిడిని కలిగిస్తోంది, ఇప్పుడు వారు హిట్ పాటలను అందించడమే కాకుండా, ఇతర సినిమా పాటల కంటే మెరుగ్గా ఉండాలి.
ఇటివలే వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్ర యూనిట్లు తమ ఫస్ట్ సింగిల్ సాంగ్స్‌ని రిలీజ్ చేశారు. ప్రస్తుతం వీర సింహారెడ్డిలోని జై బాలయ్య పాట కంటే వాల్తేరు వీరయ్య యొక్క బాస్ పార్టీ పాటకే ఎక్కువ పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.
కాబట్టి, మొదటి సింగిల్ విషయానికి వస్తే DSP విజేతగా ప్రకటించవచ్చు అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. వీరసింహారెడ్డి నుండి విడుదలైన పాట పరవాలేదు అనిపించినా.. థమన్ అవసరమైన పుష్‌ని పొందలేకపోయారు. మరి ఈ రెండు సినిమాల్లోని మిగతా సింగిల్ సాంగ్స్ ఎలా ఉంటాయో, ట్రైలర్ లు విడుదలైన వేళ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా ఎలాంటి వాదనలు వినిపిస్తారో వేచి చూడాలి.