దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ అంటే తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఇష్ట పడతారు. తెలుగులో ఘర్షణ, ఏమాయ చేసావే లాంటి సినిమాలతో ఆయన ఇక్కడి ప్రేక్షకులని మెప్పించారు. ఓ పక్క దర్శకుడుగా వరుసగా సినిమాలని తెరకెక్కిస్తూనే, ఈ మధ్య ఆయన నటుడిగా కూడా బిజీగా మారారు. అయన సినిమాలను తెరకెక్కించే శైలికి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆయన సినిమాల్లో ప్రేమ కథలకి థ్రిల్లర్ టచ్ కలిపి సరికొత్తగా తెరకెక్కిస్తారు. లవ్, యాక్షన్ జోనర్స్ ను ప్రత్యేకమైన విధంగా తీయడంలో ఆయన దిట్ట.
గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రస్తుతం శింబు హీరోగా, సిద్ది ఇద్నాని హీరోయిన్ గా ‘వెందు తనిందదు కాడు’ అనే సినిమాని తెరకెక్కించారు. గురువారం విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన టాక్ ను మరియు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. చాలా కాలానికి శింబు, గౌతమ్ మీనన్ కి బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ దక్కిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఈ చిత్రం చక్కని ఓపెనింగ్స్ ను సాధించి మంచి లాంగ్ రన్ వైపు పరుగులు తీస్తుంది.
ఇక తెలుగులో ఈ సినిమా ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ పేరుతో సెప్టెంబర్ 17న రిలీజ్ అయింది. నిజానికి రెండు వెర్షన్లు ఒకేసారి విడుదల కావాల్సి ఉన్నా, కొన్ని సాంకేతిక కారణాల వలన రెండు రోజులు ఆలస్యంగా విడుదలైంది. ఈ సందర్భంగా సినిమా ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ మాట్లాడుతూ తన పాత హిట్ సినిమాలు వాటి సీక్వెల్స్ గురించి మాట్లాడారు.
గౌతమ్ వాసుదేవ్ మీనన్ మాట్లాడుతూ.. ఇటీవలే వెంకటేష్ గారిని కలిసి ఘర్షణ పార్ట్ 2 గురించి చర్చించామని చెప్పారు. సీక్వెల్ పట్ల వెంకటేష్ గారు కూడా ఎంతో ఆసక్తి ఉన్నారని, ఇంకా స్క్రిప్ట్ పనులు ప్రారంభించలేదని, అయితే తొందరలోనే సినిమా ఉంటుందని ఆయన తెలిపారు. ఇక కమల్‌హాసన్ గారితో ‘రాఘవన్ 2’ ప్లాన్ చేయాలనుకుంటున్న విషయం.. అలాగే నాగచైతన్యతో ‘ఏ మాయ చేసావె 2’ కూడా భవిష్యత్తులో తెరకెక్కిస్తానని ఆయన తెలిపారు.
గతంలో ఈ సినిమాలు భారీ విజయం సాధించాయి. ఇప్పుడు వాటికి సీక్వెల్స్ తెరకెక్కితే ఖచ్చితంగా ప్రేక్షకులు ఆయా సినిమాల మీద ఆసక్తి చూపిస్తారు. అదే కాకుండా ప్రస్తుతం అన్ని పరిశ్రమలలో అయితే భారీ బడ్జెట్ సినిమాలు లేదా సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. తాజాగా విజయం సాధించిన ఉత్సాహంతో గౌతమ్ మీనన్ తిరిగి విజయాల బాట పడతారని ఆశిద్దాం.