భారతదేశ చరిత్రలో అత్యంత గౌరవనీయమైన స్థానం దక్కించుకున్న, అలాగే అత్యంత ప్రసిద్ధ గాంచిన ఇతిహాసాలలో మహాభారతం ఒకటి. కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతిహాసాల గురించి చర్చించే ఎవరైనా కూడా మహాభారతం గురించి చాలా గొప్పగా మాట్లాడతారు. ఎందరో మహామహుల దగ్గర నుంచీ సామాన్య ప్రజల వరకూ దీనిని చదివారు. గొప్ప సాహిత్య విలువలు ఉన్న కారణంగా, మహాభారతం అనేక సార్లు వివిధ రకాలుగా ప్రదర్శన కాబడింది.
అయితే వాటిలో అత్యంత ప్రజాదరణ పొందినది మాత్రం సిద్ధార్థ్ కుమార్ తివారీ నిర్మించిన మహాభారతం అనే చెప్పాలి, తొమ్మిదేళ్ళ క్రితం మెగా సీరియల్ గా రూపొంది 267 ఎపిసోడ్లతో స్టార్ టివిలో ప్రసారం అయిన ఈ మహా ఇతిహాసం ఘనవిజయం సాధించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమం అంత పెద్ద హిట్ కాగా.. మరియు ప్రేక్షకులు టీవీలో చూసి ఆనందిచడమే కాకుండా తమకు ఇష్టమైన ఈ షోని రిపీట్ లు వేయడానికి లేదా అప్పట్లో టివిలో చూడని వాళ్ళు చూడటానికి వీలుగా 28 సీజన్లుగా విభజించబడి డిస్నీ హాట్‌స్టార్ OTT ప్లాట్‌ఫారమ్‌లో ఇప్పటికీ అందుబాటులో ఉంది.
దాదాపు ఒక దశాబ్దం తర్వాత, డిస్నీ హాట్‌స్టార్ మహాభారతంను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకు రానుంది. అయితే ఈసారి స్థాయి మరింత పెద్దది, బడ్జెట్ కూడా ఊహకందని విధంగా ఉండబోతుంది.. అలాగే సెట్స్ కూడా భారీగానే ఉంటాయి. ఇక డిస్నీ హాట్‌స్టార్ తన హాట్‌స్టార్ స్పెషల్స్ కేటగిరీ కింద ఈ షోను ప్రసారం చేస్తుంది. ఏ స్థాయిలో దీన్ని తెరక్కిస్తున్నారో అందరికీ తెలియచేయడానికి ఈ సీరీస్ నిర్మాణ సంస్థ అయిన మైథోవర్స్ స్టూడియోస్ సంస్థ వారు అధికారికంగా కొన్ని చిత్రాలను విడుదల చేసారు.
ఆ పోస్టర్స్ చూస్తుంటే, మహాభారతాన్ని ఎంత భారీ స్థాయిలో తీయడానికి సన్నాహాలు చేస్తున్నారో అర్థం అవుతుంది. మహాభారతం వంటి మహగాథను ఇంతవరకు ఎప్పుడూ కని వినీ ఎరుగని రీతిలో ఒక అద్భుత దృశ్యకావ్యంగా తీర్చిదిద్దుతున్నామని ఈ మేరకు నిర్మాణ బృందం వారు వాగ్దానం చేసారు. ఇక ఈ వెబ్ సిరీస్‌లో భారతీయ సినిమాలోని వివిధ పరిశ్రమలకు చెందిన స్టార్ లు అందరూ కూడా భాగం అవుతారని భావిస్తున్నారు.
తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లతో పాటు ఇతర భారతీయ భాషల్లో ఈ సిరీస్ ని రూపొందించనున్నారని సమాచారం. భారీ తారాగణంతో పాటు అగ్రశ్రేణి సాంకేతిక బృందం ఈ ప్రాజెక్ట్ లో భాగం కానున్నారని తెలుస్తోంది. అయితే ఈ ‘మహాభారతం’ ను తెరకెక్కించే దర్శకుడు ఎవరనేది త్వరలోనే తెలుస్తుంది అంటున్నారు. దర్శకధీర రాజమౌళి ఎప్పటి నుంచో మహాభారతాన్ని తీయడం తన కలగా చెప్తూ వచ్చిన విషయం తెలిసిందే. మరి మహాభారతం సీరీస్ కు ఆయనే దర్శకత్వం వహిస్తారా లేక వేరే ఎవరైనా ఉంటారా అనేది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాలి.
ప్యాన్ ఇండియా అనబడే సినిమాలన్నిటినీ తలదన్నేలా భారీ స్థాయిలో తెరకెక్కే ఈ వెబ్ సీరీస్ ను బాలీవుడ్ నిర్మాత మధు మంతెన మైథోవర్స్ స్టూడియోస్ మరియు అల్లు ఎంటర్టైన్మెంట్ లతో కలిసి ఈ ప్రాజెక్ట్ ను రూపొందించనున్నారు.