‘ఉప్పెన’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమ లోకి హీరోయిన్ గా అడుగు పెట్టారు కృతి శెట్టి. బేబమ్మ పాత్రలో తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని యువ హృదయాలను కొల్లగొట్టేశారు. దీంతో ఈ ముద్దుగుమ్మకు వరుస అవకాశాలు రావడం ప్రారంభించాయి. ముఖ్యంగా యువ హీరోలకు తనే కరెక్ట్ జోడీ అనే అభిప్రాయం అందరిలో ఏర్పడింది.
“ఉప్పెన” తర్వాత ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రంలో నేచురల్ స్టార్ నాని సరసన కృతి హీరోయిన్ గా నటించారు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిసెంట్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలో తొలి సినిమాతో పోలిస్తే పూర్తి భిన్నమైన పాత్ర చేసిన కృతి శెట్టి.. హాట్ సీన్ లో నటించి పాత్ర కోసం ధైర్యం చేయగలను అని చెప్పకనే చెప్పారు.
అదే కోవలో యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య కు జోడీగా ‘బంగార్రాజు’ చిత్రంలో కృతి నటించారు. అక్కినేని తండ్రీకొడుకులు కలిసి చేసిన ఈ సినిమాలో నాగలక్ష్మి అనే గ్రామీణ యువతి పాత్రలో ఆమె ప్రేక్షకులని ఆకట్టుకున్నారు. సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయిన ఈ చిత్రం కూడా బాక్స్ ఆఫీసు వద్ద మంచి విజయాన్ని సాధించింది.
ఇలా తొలి మూడు సినిమాలు వరుసగా విజయం సాధించడంతో కృతి శెట్టికి గోల్డెన్ లెగ్ అన్న పేరు వచ్చేసింది. ముందుగానే చెప్పుకున్నట్లు యువ హీరోలు అందరూ ఆమెనే హీరోయిన్ గా కావాలని పట్టుబట్టి మరీ తీసుకున్నారు. ఐతే ఆ తర్వాతే కృతికి కష్టకాలం మొదలైంది.
వరుస హిట్ల తర్వాత ఉస్తాద్ రామ్ పోతినేని నటించిన ద్విభాషా చిత్రం ‘ది వారియర్’ లోనూ కృతి హీరోయిన్ గా కనిపించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అటు తెలుగు, ఇటు తమిళ భాషల్లో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.
దీని తర్వాత నితిన్ సరసన ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాలోనూ హీరోయిన్ గా చేయగా ఈ సినిమా కూడా డిజాస్టర్ గా మారడంతో కృతి ఖాతాలో మరో ప్లాప్ చేరింది.ఈ క్రమంలో తాజాగా సుధీర్ బాబుతో కలిసి ‘ఆ అమ్మాయి గురించి చెప్పాలి’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇంద్రగంటి మోహనకృష్ణకు చక్కని అభిరుచి గల దర్శకుడిగా పేరు ఉండటం, ట్రెయిలర్ చూస్తే ఇది ఒక చక్కని ప్రేమ కథ అనిపించే విధంగా ఉండటంతో ఈసారి బెబమ్మకు ఖచ్చితంగా హిట్ వస్తుంది అని అంతా అనుకున్నారు.
కానీ “ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయింది. తొలిరోజే బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. కాకుంటే మిగతా సినిమాలతో పోలిస్తే.. ఈ సినిమాలో నటన పరంగా కాస్త స్కోప్ ఉండటం వల్ల, ఆ విషయంలో కొన్ని మంచి మార్కులు పడ్డాయి.
మొత్తంగా ‘ఉప్పెన’ తర్వాత గోల్డెన్ లెగ్ గా మారిన కృతి శెట్టి, హ్యాట్రిక్ డిజాస్టర్ లతో కెరీర్ లో బ్యాడ్ ఫేజ్ లో ఉన్నారు. సినిమాల ఎంపికలో ఆమె సరైన విధంగా వ్యవహరించలేదని, ఏ సినిమా పడితే ఆ సినిమా చేయడం వల్ల ఇలా వరుస పరాజయాలు ఎదుర్కున్నారని కొందరు విశ్లేషకులు అంటున్నారు. చిత్రసీమలో సెంటిమెంట్ కి అధిక స్థాయిలో ప్రాధాన్యం ఉంటుంది. ఇలాగే కొనసాగితే ఇరన్ లెగ్ అన్న ఇమేజ్ పడిపోయి ఆమె మెల్లగా టాలీవుడ్ కు దూరమయ్యే పరిస్థితి వస్తుందని అభిప్రాయ పడుతున్నారు.
కృతి శెట్టి చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి. నాగచైతన్య – వెంకట్ ప్రభు కాంబినేషన్లో తెరకెక్కుతున్న తెలుగు తమిళ ద్విభాషా సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. అలానే తమిళ హీరో సూర్య – బాలా కలయికలో రూపొందుతున్న చిత్రంలోనూ ఆమె నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయి మళ్ళీ బెబమ్మ కెరీర్ ను సరైన దారిలో నడిపిస్తాయని ఆశిద్దాం.