సాధారణంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు ఆయన తండ్రి కృష్ణ పుట్టినరోజు (మే 31) లేదా ఆయన పుట్టిన రోజు (ఆగస్టు 8) నాడు బయటకు వస్తుంటాయి. అయితే ఈ ట్రెండ్ కి తన నెక్ట్స్ మూవీతో బ్రేక్ పడనుంది.
లెజెండరీ యాక్టర్ కృష్ణ ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. అందుకే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి ఫస్ట్ లుక్ పోస్టర్లు కానీ, ప్రమోషనల్ కంటెంట్ కానీ రివీల్ చేయాలని అనుకోవటం లేదు. ఆగష్టులోనే విడుదల కానున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను మహేష్ బాబు పుట్టిన రోజు ఆ విడుదల చేసే అవకాశం లేదు కాబట్టి సూపర్ స్టార్ మహేష్ అభిమానులను ఎక్కువ కాలం వేచి ఉండేలా చేయాలని ఈ చిత్ర నిర్మాతలు అనుకోవడం లేదు.
ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా టైటిల్ ని త్రివిక్రమ్ లాక్ చేశారని, ఉగాది పండుగ నాడు టైటిల్, ఫస్ట్ లుక్ రివీల్ చేయాలని ప్లాన్ చేస్తున్నారనీ సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మార్చి 19 లేదా 20న వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం వికారాబాద్ జిల్లా శంకరపల్లి గ్రామ సమీపంలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. మహేష్ బాబు, పూజా హెగ్డే, శ్రీలీల తదితరులు ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు.
మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రం SSMB28. దాదాపు 12 ఏళ్ల తర్వాత త్రివిక్రమ్, మహేష్ కలయికలో వస్తున్న ఈ సినిమాపై అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కు థమన్ ఎస్ సంగీతం అందించనున్నారు. అరవింద సమేత, అల వైకుంఠపురములో చిత్రాల తర్వాత ఆయన త్రివిక్రమ్ తో చేస్తున్న మూడో సినిమా కావడం విశేషం. ఇక నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తుండగా, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.