గత కొంతకాలంగా తెలుగు సినిమా నిర్మాతల మండలి పలు సమావేశాలు నిర్వహించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే యత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమలో ఉన్న కొన్ని సమస్యలను పరిష్కరించేందుకు వారు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇటీవల పరిశ్రమ వారిని ప్రధానంగా ఇబ్బంది పెడుతున్న సమస్య ప్రేక్షకులు మునుపటిలా సినిమా హాళ్లకు తరలి రాకపోవడం.
కానీ అది కేవలం నిర్మాతలు మరియు డిస్ట్రిబ్యుటర్లు తమకు తామే తెచ్చుకున్న సమస్య అని ఖచ్చితంగా చెప్పచ్చు. ప్రేక్షకులు ఎప్పుడూ తమకు సరైన వినోదం అందించే సినిమాను చూసేందుకు సిద్ధంగా ఉంటారు. గత వారం విడుదలైన బింబిసార, సీతా రామం సినిమాల ఫలితాలే ఇందుకు నిదర్శనం. మంచి సినిమా వస్తే తెలుగు ప్రేక్షకులు ఇతర పరిశ్రమల కంటే ఎక్కువగా ఆదరిస్తారనడానికి ప్రధాన ఉదాహరణ ఆ రెండు చిత్రాల విజయమే.
అయితే ఎప్పటిలాగే తెలుగు నిర్మాతల మండలి తమ సినిమాల పరాజయాలకు వేరే కుంటి సాకులను వెతికే ప్రయత్నం చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇదివరకే నటీనటుల పారితోషికాలు మరియు ఓటిటి సంస్థలను అకారణంగా నిందించిన నిర్మాతల మండలి ఇప్పుడు మరో వింత ప్రతిపాదనతో ముందుకు వచ్చింది.
ఈ మేరకు తెలుగు సినీ నిర్మాతల మండలి ప్రతిపాదించిన కొత్త నిర్ణయం ఏంటంటే.. ఓవర్సీస్ ప్రీమియర్‌లను, భారత దేశంలో షోలను ఓకే సారి ప్రదర్శించాలని వారు చర్చించుకున్నట్లు తెలుస్తుంది. ఓవర్సీస్ షోల వల్ల వచ్చే ముందస్తు నెగటివ్ టాక్ ను నివారించడానికి వారు భారతదేశంలో మరియు ఓవర్సీస్‌లో ఒకే సమయంలో ప్రదర్శనలు నిర్వహించాలని కోరుకుంటున్నారు.
నిర్మాతల ప్రకారం, ఓవర్సీస్ ప్రీమియర్ షోల వల్ల సినిమాలకి నెగటివ్ టాక్ ఎక్కువగా ప్రచారం అయి, సినిమా బాక్సాఫీస్ ఫలితాన్ని ప్రభావితం చేస్తుందట. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఒక సినిమా బాగోలేక పోతే ఏ షో ఎప్పుడు వేసినా అది పరాజయం పాలవుతుందన్న విషయాన్ని మాత్రం వారు ఎలా విస్మరిస్తున్నారో అర్థం కావట్లేదు.
తాజాగా నితిన్ హీరోగా నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమా మంచి క్రేజ్ తోనే విడుదల అయినప్పటికీ, సినిమా ఏమాత్రం బాగొలేని కారణంగా నెగటివ్ టాక్ వచ్చి సినిమా ఫ్లాప్ అయింది, మరి ఈ సినిమాకి ఓవర్సీస్ లో, భారతదేశంలో చాలా దగ్గరగా షోలు వేశారు మరి అలాంటప్పుడు ఫ్లాప్ ఎందుకు అయింది?.. దానికి సమాధానం ఒక్కటే.. సినిమాలో సరైన కంటెంట్ లేకుంటే ఏ సినిమా అయినా ఫ్లాప్ కాక తప్పదు.