కరోనా పాన్డేమిక్ తరువాత ప్రేక్షకులు సినిమా చూసే విధానం మారింది. ప్రేక్షకులు వీకెండ్ సినిమాకు అలవాటు పడ్డారు అని ప్రముఖ నిర్మాత దిల్ రాజు పేర్కొన్నారు. ఆయన చెప్పిన దాంట్లోనూ నిజం లేకపోలేదు.
యే ఇండస్ట్రీ అయినా మార్పు అనేది సహజం. సమయానికి తగ్గట్టు ఆయా కాలానికి అనుగుణంగా అప్డేట్ అవుతూ ముందుకు వెళ్తేనే అభివృద్ధి సాధ్యపడుతుంది.ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ కూడా అలాంటి పరిస్థితి లోనే ఉంది.
కరోనా మహమ్మారి దాడికి ఎన్నో జీవితాలు ప్రాణాలు కొల్పోగా పరోక్షంగా ఎన్నో పరిశ్రమలు తీవ్రమైన సంక్షోభం ఎదుర్కొన్నాయి. అందులో తెలుగు సినిమా కూడా ఒకటి. అయితే మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు సినిమా అంటే ఎంత పిచ్చి అనేది అందరికీ తెలిసిందే.
ఆ పిచ్చి ప్రేమ వల్లే తెలుగు సినీ పరిశ్రమ త్వరగానే కోలుకుని పునరుద్ధరణ వైపు అడుగులు వేస్తుంది. అయితే అన్నీ సవ్యంగా ఉన్నాయి, సమస్యలు ఏవీ లేవు అనుకుంటే పొరపాటే అవుతుంది.ఎందుకంటే కరోనా కి ముందు, కరోనా తరువాత చెప్పుకోదగ్గ మార్పులు వచ్చాయి ప్రేక్షకులు సినిమా చూసే విధానంలో.
ఒకప్పుడు ధియేటర్ లో నుంచి సినిమా వెళ్ళిపోయాక కనీసం ఆరు నెలల గడువు తరువాత కానీ టీవిలో వచ్చేది కాదు. ఓటీటీ రెవల్యూషన్ మూలాన ఆ గ్యాప్ కాస్తా తగ్గిపోయి నెల వరకూ వచ్చింది. అయితే ఒక దశలో తెలుగు సినీ పెద్ద నిర్మాతలు కలిసి కనీసం 6 వారాల తరువాతనే రిలీజ్ గ్యాప్ ఉండాలి అని నిర్ణయించారు. అయితే కరోనా వేవ్ ల వల్ల చాలా చిన్న సినిమాలు, కొన్ని పెద్ద సినిమాలు కూడా డైరెక్ట్ గా ఓటీటీ లో విడుదల కావడం,. ఆ పై తిరిగి ధియేటర్ లు తెరిచిన తరువాత థియేట్రికల్ రిలీజ్ కీ, ఓటిటీ రిలీజ్ కీ మధ్య గ్యాప్ తగ్గిపోయింది.
నాలుగు వారాల లోపే టీవీ లలో, ఫోన్ లలో సినిమాలు అందుబాటులోకి వచ్చేస్తుంటే ఇంక ధియేటర్ కి వెళ్ళడం ఎందుకు అని చాలా ఫ్యామిలీ లు అనుకుని, ఏదైనా పెద్ద సినిమా వచ్చినప్పుడు మాత్రమే ధియేటర్ లకు తరలి వస్తున్నారు.
నిర్మాత దిల్ రాజు చెప్పినట్టే తొలి మూడు రోజుల వరకూ అభిమానులు, సినీ ఔత్సాహికులు మాత్రమే సినిమా చూడటానికి వస్తున్నారు, ఇతర న్యూట్రల్ ఆడియెన్స్, ఫ్యామిలీ ఆడియెన్స్ మాత్రం ఖచ్చితంగా కొన్ని సినిమాలకి మాత్రమే బయటకి వస్తున్నారు. అందుకే దాదాపు ప్రతి సినిమాకీ తొలి సోమవారం కలెక్షన్ లు డ్రాప్ అవుతున్నాయి. దానికి తగ్గట్టే ఇండస్ట్రీ కూడా వినూత్న పద్ధతిలో ఆలోచించి సినిమాలు నిర్మించి, ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్రచారం చేయాలి. అప్పుడే పరిస్థితిలో మార్పు వస్తుంది.