తమిళ హీరో సూర్య మరియు దక్షిణ భారత దిగ్గజ దర్శకుడు శంకర్‌ల కాంబినేషన్లో ఒక భారీ సినిమా ఉంటుందనే వార్త ఒకటి కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం గట్టిగా వినిపిస్తుంది. తమిళ చరిత్రలో అత్యంత ప్రసిద్ధ నవలల్లో ఒకటైన వేల్పారి ఆధారంగా తెరకెక్కించే సినిమాను వీరిద్దరూ కలిసి నిర్వహించనున్నట్లు సమాచారం.
తాజాగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కి విడుదలకు సిద్ధంగా ఉన్న పొన్నియిన్ సెల్వన్ సినిమా, తమిళ నాట భారీ ప్రాచుర్యం పొందిన కల్కి నవల ఆధారంగా రూపొందించారు. ఇప్పుడు అదే కోవలో, వేల్పారి అనే నవల ఈనాటికీ తమిళ ప్రజలు ఎంతగానో ఇష్టపడే ఒక ఐకానిక్ నవల. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే పొన్నియిన్ సెల్వన్ నవలతో పోలిస్తే వేల్పారి నవలకే అభిమానుల సంఖ్య ఎక్కువగా ఉంది.
వేల్పారి నవల సంగం యుగానికి చెందినది. మరియు వేలిర్ వంశానికి పాలకుడైన వేల్పారి కథను ఈ నవల చెబుతుంది. వేల్పారి ప్రాచీన తమిళకంలోని పరంబు నాడు మరియు ఇతర పరిసర ప్రాంతాలను పాలించాడు. ఈ నవలను అకాడమీ అవార్డు గ్రహీత రచయిత సు వెంకటేశన్ రాశారు. ఈ నవల తమిళ ప్రజలకు ఎంతగానో ప్రీతి పాత్రమైనది, వారి హృదయాలలో ఎప్పుడూ ఈ నవలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ పీరియాడికల్ డ్రామాను తమిళ స్టార్ హీరో సూర్య, భారీ బడ్జెట్ మరియు హంగామా గల చిత్రాలను అందించడంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న దర్శకుడు శంకర్‌లు కలిసి తెరకెక్కించనున్నారు. కాగా వేల్పారి నవల చాలా వైవిధ్యమైన తరహాలో ఉంటూ అద్భుతంగా వ్రాసిన పాత్రలతో నిండి ఉన్న నవల.
అందువల్ల నిజంగా ఆ నవలను సినిమాగా తీస్తే మాత్రం ఈ చిత్రానికి భారీ స్థాయిలో స్టార్ తారాగణం అవసరం అనడంలో ఎలాంటి అనుమానం లేదు. పొన్నియిన్ సెల్వన్ లాగానే, వేల్పారి ప్రపంచంలో కూడా కథలో చాలా ముఖ్యమైన స్త్రీ పాత్రలు కూడా ఉన్నాయి. మరి నిజంగా ఈ సినిమా రూపు దాల్చితే మరో భారీ మల్టీస్టారర్ సినిమా చూసే అవకాశం అటు తమిళ ప్రేక్షకులతో పాటు ఇటు తెలుగు ప్రేక్షకలకు కూడా దక్కుతుంది.
కాగా ఈ సినిమా బడ్జెట్ 1000 కోట్లు అని ట్రేడ్ వర్గాల ద్వారా అంచనా వేయబడింది, ఇది నిజంగానే భారతీయ సినిమా చరిత్రలోనే అత్యధికం. ఇక ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ కోసం దర్శకుడు శంకర్ ఇప్పటికే నటీనటులు మరియు ఇతర సిబ్బందిని వెతకడం ప్రారంభించారట.