నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ చేయబోయే సినిమా ఖరారైంది. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి (Thalaivar 170) గతంలో సూర్యతో జై భీమ్ సినిమా తీసిన ప్రముఖ దర్శకుడు టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించనున్నారు. కాగా పేటా, దర్బార్ చిత్రాల తర్వాత రజినీకాంత్ సినిమాకు అనిరుధ్ రవిచందర్ మూడోసారి సంగీతం అందించనుండటం విశేషం. త్వరలోనే షూటింగ్ ప్రారంభించి 2024లో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
‘2.0’, ‘దర్బార్’ చిత్రాల తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ తో లైకా ప్రొడక్షన్స్ వారు కలిసి చేస్తున్న మూడో చిత్రమిది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ఈ రోజు ప్రకటించింది. కాగా వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు ఎంతగానో గర్విస్తున్నట్లు తెలిపారు.
ఇక లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో రజినీకాంత్ ముఖ్య పాత్రలో నటిస్తున్న మరో ప్రాజెక్ట్ లాల్ సలాం ప్రస్తుతం ప్రారంభ దశలో ఉంది. ‘లాల్ సలాం’ చిత్రానికి ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రికెట్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. తమిళ యువ స్టార్ హీరో విష్ణు విశాల్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో మరో యువ హీరో విక్రాంత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు.
ఇదిలా ఉంటే సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జైలర్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. జైలర్ చిత్రంలో శివరాజ్ కుమార్, రమ్యకృష్ణ, తమన్నా కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2022 ఆగస్టులో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి కూడా అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.