ప్రపంచ శ్రీమంతుల్లో బిజినెస్ టైకూన్ బిల్ గేట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకు మన దేశంతో మంచి అనుబంధం ఉంది. ఈ ప్రపంచ శ్రీమంతుడిని వెండితెర శ్రీమంతుడు కలిశారు. అదేనండి మన తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు. ప్రస్తుతం మహేష్ అమెరికాలో ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి ఏడాది కనీసం రెండు సార్లైనా కుటుంబంతో కలిసి విహార యాత్రలకు వెళ్ళడం ఆయనకు అలవాటు.
ఆ యాత్రల్లో భాగంగానే ఆయన పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తూ కుటుంబంతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు.వాటికి అభిమానులు కూడా లైక్/షేర్ లు కొడుతూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.తాజాగా ఆయన పోస్ట్ చేసిన ఫొటో ఒకటి నెజటిన్స్‌ను ఆకట్టుకోవటమే కాదు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంతకీ అంతలా వైరల్ అవుతున్న పిక్ ఎవరిదో తెలుసా! బిల్స్ గేట్స్‌తో మహేష్ అండ్ నమ్రతా శిరోద్కర్ ఉన్న ఫొటో.
అమెరికాలో న్యూయార్క్ నగరంలో బిల్ గేట్స్‌ను మహేష్ కలుసుకున్నారు. ఫొటో షేర్ చేసిన మహేష్ ‘ప్రపంచంలో ఎంతో మందికి స్ఫూర్తి ఇచ్చిన , ప్రపంచం చూసిన గొప్ప దార్శనికుడు బిల్ గేట్స్‌ను కలవటం చాలా ఆనందంగా అనిపించింది. ఆయన ఎంతో వినయ పూర్వకంగా ఉండటమే కాదు నిజంగా ఎంతో స్ఫూర్తిని నింపారు’ అని కొటేషన్ కూడా షేర్ చేశారు. మహేష్ షేర్ చేసిన ఫొటోను చూసిన ఆయన ఫాలోవర్స్, నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బిజినెస్‌మేన్ 2 తీయమని కొంత మంది సలహా ఇస్తే మరొకరేమో నెక్ట్స్ అమెరికా ప్రెసిడెంట్ బైడెన్‌తో ఉన్న ఫొటోను షేర్ చేయమని రిక్వెస్ట్ చేస్తూ సరదాగా వ్యాఖ్యానించారు.
ఇక సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది సర్కారువారి పాట చిత్రంతో సక్సెస్ అందుకున్న మహేష్ తదుపరి త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే మరో వైపు పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి కూడా మహేష్ కోసం కథను సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నారు.