సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ లో తొలిసారిగా దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి RRR సినిమాతో ఆస్కార్స్ వైపు అడుగులు వేయడంతో ఈ కాంబినేషన్ ఇప్పటికే సంచలనంగా మారింది. ఈ సినిమా రిలీజ్ నుంచే హద్దులు దాటి వెళ్తుందనే అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.
ఎప్పటిలాగే తన తనయుడి సినిమాకి కథలు సమకూర్చే రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కూడా కథ అందిస్తున్నారు. ఇక తాజాగా మహేష్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి. ఆయన ఇంటెన్స్ యాక్టర్ గా మహేష్ ని కొనియాడారు. మహేష్ తనదైన నటనతో భావోద్వేగాలను సులభంగా మార్చగలరని ఆయన అన్నారు. అందువల్ల ఈ యాక్షన్ సూపర్ స్టార్ కోసం స్క్రిప్ట్ రాయడం చాలా సులభం అని ప్రముఖ రచయిత చెప్పారు.
ఈ మధ్య కాలంలో రాజమౌళి పలు మీడియా ఇంటరాక్షన్స్ లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుందని చెప్పారు. ఇండియానా జోన్స్ తరహాలో ఈ సినిమా ఉంటుందని దర్శకధీరుడు రాజమౌళి తెలిపారు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రం పై అంచనాలు మరో స్థాయిలో ఉంటాయనేది స్పష్టం.
కాగా ఈ సినిమాకి అడవి నేపథ్యంలో సాహసంతో కూడిన ఒక కథ రాయాలని విజయేంద్ర ప్రసాద్ కు ఆదేశాలు ఇచ్చారట. అందుకే సూచనల మేరకు మహేష్ తో భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీకి కావాల్సిన అన్ని అంశాలను ఈ సినిమాలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఇటీవలే తన తండ్రి దివంగత ఘట్టమనేని కృష్ణ మృతి చెందిన సంఘటన తర్వాత కొద్ది రోజులు సినిమాలకి దూరంగా ఉన్న మహేష్ బాబు తాజాగా తిరిగి పనిలో పడ్డట్లు తన ట్విట్టర్ ఖాతాలో ఒక పిక్ షేర్ చేశారు. తమ అభిమాన హీరో మళ్లీ పునరుత్తేజం పొందడం చూసి మహేష్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.