నటనలో తన తండ్రికి సరైన వారసుడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆయన మంచి నటుడే కాదు, మచ్చలేని వ్యక్తిత్వం కూడా. ఐతే ఆయన తన భావోద్వేగాలను బహిరంగంగా చూపించడానికి ఇష్టపడరు, అయినప్పటికీ, ఆయన తన ట్విట్టర్‌లో తన తండ్రి మరణం తర్వాత తను పొందుతున్న పరివర్తన గురించి ఒక లేఖను రాశారు. ఆ లేఖ అందరినీ కదిలిస్తోంది.
“మీ జీవితం గొప్పగా సాగింది. మీ నిష్క్రమణ కూడా అంతే గొప్పగా జరిగింది. అదంతా మీ గొప్పతనం. జీవితం చివరి వరకూ ధీశాలిగా, ధైర్యసాహసాలు కలబోసిన వ్యక్తిగా జీవించారు. ధైర్యసాహసాలు మీ స్వభావం. నా స్ఫూర్తి, నా ధైర్యం నేను చూసినదంతా మీతోనే వెళ్లిపోయాయి. అదేంటో, గతంతో పోలిస్తే ఇప్పుడు నేను మరింత దృఢంగా ఉన్నానని అనిపిస్తోంది. ఇప్పుడు నాకెలాంటి భయం లేదు.. మీరు అండగా ఎల్లప్పటికీ ఉంటారు. మీ ఆశీస్సులు, ప్రేమ ఎప్పటికీ నాతోనే ఉంటాయి. మీరు అందించిన వారసత్వాన్ని కొనసాగిస్తా.. మీరు మరింత గర్వపడేలా నడుచుకుంటా. లవ్ యూ నాన్న.” అని మహేష్ బాబు భావోద్వేగం చెందారు.
కాగా, ఈ ఏడాది.. మహేష్ బాబు కుటుంబానికి తీరని వేదనను కలిగించింది. సోదరుడు రమేశ్‌బాబు, తల్లి ఇందిర, తండ్రి కృష్ణల మరణాలు ఒకదాని వెంట ఒకటి జరగడంతో మహేశ్ మానసికంగా ఒడుదొడుకులు ఎదుర్కొన్నారు. ఇక ఐదున్నర దశాబ్దాలపాటు చిత్రసీమను ఏలిన నటశేఖరుడు నవంబరు 15న తుదిశ్వాస విడిచారు. కార్డియాక్ అరెస్ట్‌తో అంతకముందు రోజే అర్ధరాత్రి గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు.
వైద్యులు వెంటనే ఆయనకు సీపీఆర్ చేసి కార్డియాక్ అరెస్ట్ నుంచి బయటకు తెచ్చారు. అయితే కీలకమైన అవయవాలు పనిచేయకపోవడంతో ఐసీయూకు తరలించి వెంటిలేటర్‌పై వైద్యం అందించారు. కృష్ణ క్షేమంగా తిరిగి రావాలని అభిమానులు శ్రేయోభిలాషులు ప్రార్థించారు. సూపర్‌స్టార్‌ను బతికేందుకు వైద్యులు గంటల తరబడి శ్రమించినా ఫలితం లేకపోయింది.
అలా నవంబరు 15 తెల్లవారుఝామున 4.09 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించారు. అనంతరం నవంబరు 16న ప్రభుత్వం లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
మహేష్ తన లేఖలో రాసింది అక్షరాలా నిజమే. నటుడిగా, స్టార్‌గా సూపర్‌స్టార్ కృష్ణ అద్భుతమైన ప్రయాణం మరియు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఆయన చేసిన కృషి అసమానమైనది. అలాగే ఒక వ్యక్తిగా మరియు తండ్రిగా కూడా ఆయన తన పిల్లలు మరియు కుటుంబం గర్వించేలా చేసారు.
ఒకే ఏడాదిలో కుటుంబంలో ముగ్గురు చనిపోవడం మహేష్‌కి చాలా కష్టమే. ఈ కష్ట సమయాల్లో మహేష్ త్వరగా కోలుకునే సంకేతాలు ఈ లేఖ ద్వారా వచ్చాయి. మహేష్ లేఖలో పేర్కొన్నట్టు గానే అద్భుతమైన సినిమాలు అందించి తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం.