దర్శకుడు గోపీచంద్ మలినేని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అందుకు కారణం లేకపోలేదు. సూపర్ స్టార్ రజినీకాంత్ గోపీచంద్ కు ఫోన్ చేసి వీరసింహారెడ్డిని అభినందించారు. సూపర్ స్టార్ నుంచి వచ్చిన పొగడ్తలకు ముగ్ధుడైన దర్శకుడు ట్విట్టర్ ద్వారా తన ఉత్సాహాన్ని పంచుకున్నారు.
గోపీచంద్ మలినేని తన ఉత్సాహాన్ని పంచుకుంటూ “ఇది నాకు ఒక సర్రియలిస్టిక్ మూమెంట్, తలైవర్, సూపర్ స్టార్ రజినీకాంత్ సార్ నుండి నాకు కాల్ వచ్చింది. వీరసింహారెడ్డి సినిమా ఆయనకు నచ్చింది. నా సినిమా గురించి ఆయన చెప్పిన పొగడ్తలు, ఆయన అనుభవించిన భావోద్వేగాలు నాకు ఈ లోకంలో అన్నింటికంటే ఎక్కువ. థాంక్స్ రజినీ సార్” అన్నారు.
సంక్రాంతికి విడుదలైన బాలకృష్ణ వీరసింహారెడ్డి బాలయ్య అభిమానులకు పక్కా మాస్ ఎంటర్టైన్మెంట్ అందించింది. తొలి రోజు ఈ సినిమాకు మిశ్రమ స్పందన రాగా, ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్స్ బ్రహ్మాండంగా ఉండటంతో బాలయ్య కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకుంది.
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం వీరసింహారెడ్డి. బాలకృష్ణ అఖండ, గోపీచంద్ మలినేని క్రాక్ చిత్రాలతో భారీ విజయాలతో కెరీర్ పీక్ లో ఉన్న సమయంలో కుదిరిన ఈ ప్రాజెక్ట్ భారీ అంచనాల మధ్య విడుదలైంది.
ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్యరాయ్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.