సుధీర్ బాబు నటించిన తాజా చిత్రం హంట్ బాక్సాఫీస్ వద్ద తొలి రోజే పూర్తిగా క్రాష్ అయి ప్రపంచవ్యాప్తంగా కోటి కంటే తక్కువ షేర్ వసూలు చేసింది. ఇక అంతటి పరాజయం తర్వాత ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ అయిన రెండు వారాల్లోనే ఓటీటీలో రాబోతోంది. ఫిబ్రవరి 10 నుంచి అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
నిజానికి కెరీర్ ఆరంభం నుంచి సుధీర్ బాబు వినూత్న కాన్సెప్ట్ లతో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో మంచి ఇమేజ్ సంపాదించుకున్నారు. సమ్మోహనం, నన్ను దోచుకుందువటే వంటి చిత్రాల్లో ఆయన నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభించాయి.
ఇటీవల మంచి అంచనాలతో విడుదలైన ‘హంట్’ సుధీర్ సినిమా విజయం పై పెట్టుకున్న ఆశలను నిజం చేయలేక పోయింది. రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలైనా ఈ చిత్రం ప్రేక్షకుల దృష్టిని ఏమాత్రం ఆకర్షించలేకపోయింది.
పదేళ్ల క్రితం విడుదలైన మలయాళ చిత్రం ‘ముంబై పోలీస్’కు రీమేక్ గా ఈ చిత్రాన్ని రూపొందించారు. అయితే ఈ సినిమాను ముందు నుంచి రీమేక్ గా ప్రచారం చేయలేదు. అయితే ప్రోమోల ద్వారా అది స్పష్టమైపోవడంతో నెటిజన్లు ఇది ముంబై పోలీస్ రీమేక్ అని గుర్తించారు.
మహేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుధీర్ బాబు పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నటించారు. శ్రీకాంత్, భరత్ కీలక పాత్రల్లో నటించారు. భవ్య క్రియేషన్స్ పతాకం పై వి.ఆనందప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.