మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ సినిమా (RC 16) రూపొందుతున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా వినిపిస్తున్న పుకార్ల ప్రకారం బుచ్చిబాబు సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు తెలుస్తోంది. కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ఇద్దరు అన్నదమ్ముల పాత్రల్లో నటించనున్నట్లు సమాచారం. ఇక రెండు పాత్రల్లోనూ ఆయన క్యారెక్టరైజేషన్ కూడా చాలా ప్రత్యేకంగా ఉండనుందట.
వృద్ది సినిమాస్ పతాకం పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ను సెప్టెంబర్ లో ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ అన్ని రకాల సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది అధికారికంగా ప్రకటించనప్పటికీ.. మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ పేర్లు మాత్రం వార్తల్లో నిలిచాయి.
అంతే కాదు ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ పేరు వినిపిస్తోంది. రెహమాన్ గతంలో ‘సూపర్ పోలీస్’, ‘నాని’, ‘ఏ మాయ చేసావె’, ‘కొమురం పులి’, ‘సాహసం శ్వాసగా సాగిపో’ (2016) వంటి తెలుగు సినిమాలకు సంగీతం అందించిన సంగతి తెలిసిందే.
ఒకవేళ ఆర్ సి 16లో రెహమాన్ భాగం అవుతారనే వార్త నిజమైతే ఏడేళ్ల తర్వాత ఏఆర్ రెహమాన్ ఓ తెలుగు సినిమాకు సంగీతం అందించనున్నారన్నమాట. మరి ఈ సినిమాకు రెహమాన్ పని చేస్తున్నారని చిత్ర యూనిట్ నుంచి అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే. అలాగే ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడనే పుకార్లు కూడా నిజమవ్వాలని కోరుకుందాం. ఎందుకంటే ఆ పుకార్లు నిజమైతే ఆయన అభిమానులు ఖచ్చితంగా ఉత్సాహంలో తేలిపోతారు.