టైమ్ మ్యాగజైన్ 2023 అత్యంత 100 ప్రభావవంతమైన జాబితాలో చోటు దక్కించుకోవడం ద్వారా ఎస్ ఎస్ రాజమౌళి భారతదేశం గర్వపడేలా చేశారు. ఆయా రంగాల్లో గణనీయమైన ప్రభావం చూపి, సమాజం పై చెరగని ముద్ర వేసిన వ్యక్తులను ఈ ప్రతిష్ఠాత్మక జాబితా గుర్తిస్తుంది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ దర్శకుడు రాజమౌళి కావడం విశేషం.
బాహుబలి ఫ్రాంచైజీకి దర్శకత్వం వహించిన దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళిని ‘పయనీర్స్’ జాబితాలో చేర్చారు. ప్రేక్షకులను కట్టిపడేసే సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ను క్రియేట్ చేయడంలో రాజమౌళి దిట్టగా పేరు పొందారు. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ తో రాజమౌళి ఆ అందరి దృష్టిని ఆకర్షించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ సినిమా ఇటీవలే ఆస్కార్ ను కూడా గెలుచుకుంది. ఈగ, మగధీర వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన రాజమౌళి భారతీయ సినిమాకు అందించిన సహకారం వెలకట్టలేనిది అని చెప్పడం అతిశయోక్తి కాదు.
మరో వైపు బాలీవుడ్ కింగ్ గా పేరొందిన షారుఖ్ ఖాన్ కూడా ఈ ఐకాన్స్ లిస్ట్ లో చోటు దక్కించుకున్నారు. ఈ నటుడికి మూడు దశాబ్దాలకు పైగా విస్తారమైన కెరీర్ ఉంది, మరియు భారతీయ సినిమాకు ఆయన చేసిన కృషి అపారమైనది.
ఎస్ ఎస్ రాజమౌళి, షారుఖ్ ఖాన్ తో పాటు కింగ్ చార్లెస్, మైఖేల్ బి జోర్డాన్, సల్మా హయక్, బెల్లా హడిడ్, డోజా క్యాట్ తదితరులకు కూడా ఈ జాబితాలో చోటు దక్కింది.
టైమ్ మ్యాగజైన్ 2023 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో షారుఖ్ ఖాన్ మరియు ఎస్ఎస్ రాజమౌళిని చేర్చడం వారి సామర్థ్యం, శ్రద్ధ మరియు అంకితభావానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ప్రపంచంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ప్రచురణలలో ఒకటైన ఈ సంస్థ వారిని గుర్తించడం నిజంగా భారతదేశానికి మరియు భారతీయ చలనచిత్ర పరిశ్రమకు గర్వకారణం అనే చెప్పాలి.