దసరా కానుకగా మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 5వ తారీకున రాబోతున్న గాడ్ ఫాదర్ సినిమాకు పోటీగా నాగార్జున ది ఘోస్ట్ సినిమా కూడా విడుదల అవుతుంది. ఇలా ఇద్దరూ అగ్ర హీరోల రెండు సినిమాలు ఒకే రోజు విడుదల చేయడం ద్వారా రెండు సినిమాలకు ఖచ్చితంగా ఎంతో కొంత నష్టం వాటిల్లుతుందని ట్రేడ్ వర్గాలు భావించాయి.
అయితే ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా అదే రోజు దసరా సందర్భంగా బెల్లంకొండ సాయి గణేష్ నటించిన మొదటి సినిమా స్వాతి ముత్యం చిత్రాన్ని కూడా విడుదల చేసేందుకు సిద్ధం అయ్యారు. అయితే రెండు పెద్ద సినిమాలు విడుదల అవుతున్న సమయంలో ఇలా చిన్న సినిమా కేవలం తేదీని ప్రకటించొచ్చు కానీ సినిమా నిజంగా విడుదల అవటం కష్టమని, వాయిదా పడుతుందని చాలా మంది భావించారు.
అయితే స్వాతి ముత్యం చిత్రం విడుదల తప్పకుండా దసరాకే ఉంటుందని చిత్ర నిర్మాత అయిన సూర్య దేవర నాగవంశీ తాజాగా ప్రెస్ మీట్లో చెప్పారు. చిరంజీవి, నాగార్జున వంటి హీరోల సినిమాలకు పోటీగా విడుదల చేస్తున్నారు కదా అని అడిగిన ప్రశ్నకు బదులుగా నిర్మాత నాగ వంశీ స్పందిస్తూ… స్వాతి ముత్యం మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కనుకనే దసరా పండగ సరైన విడుదల తేదీగా భావించి విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
అంతే కాకుండా గాడ్ ఫాదర్ సినిమా ను మార్నింగ్ షో… ది ఘోస్ట్ సినిమాను మ్యాట్నీ షో చూసిన ప్రేక్షకులు ఫస్ట్ షో కి స్వాతి ముత్యం కూడా చూస్తారనే నమ్మకాన్ని నిర్మాత నాగవంశీ వ్యక్తం చేశారు. అలాగే తమకు ఉన్న బలమైన డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ వాల్ల సినిమాకు థియేటర్ల కొరత కూడా ఉండదని, సినిమా చిన్నదైనా నిర్మాణ సంస్థ పెద్దది కాబట్టి విడుదల విషయంలో ఎలాంటి ఇబ్బందీ ఉండదని ఆయన అన్నారు.
నాగ వంశీ మాటల్లో ఉన్న ఆత్మ విశ్వాసం, సినిమా విజయం పట్ల ఆయన వ్యక్తం చేసిన ధీమాను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎంటి సినిమా అంతా బాగుంటుందా అని ఆలోచనల్లో పడ్డారు. అయితే తాజాగా స్వాతి ముత్యం చిత్ర బృందం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 5న సినిమా విడుదలకు సిద్దం అవుతుండగా, అక్టోబర్ 4న తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ధియేటర్లలో ఈ చిత్రానికి ప్రీమియర్ షోలు వేయాలని సన్నాహాలు చేస్తున్నారు అని తెలియ వచ్చింది.
ఇటివలే ఇలాంటి ప్రీమియర్ షోలు అడివి శేష్ మేజర్ సినిమాకు ప్రదర్శించారు. మరి స్వాతిముత్యం వంటి చిన్న సినిమాకు ఈ ప్రచార వ్యూహం ఫలిస్తుందా లేదా నెగటివ్ టాక్ వచ్చి మొదటికే మోసం వస్తుందా అనేది చూడాలి.