దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సీతారామం సినిమా ఆగష్టు 5 న థియేటర్లలో విడుదలైంది. తొలిరోజు ఈ చిత్రానికి డీసెంట్ టాక్ తో పాటు పరవాలేదు అనిపించేలా కలెక్షన్లు వచ్చాయి. కళ్యాణ్ రామ్ నటించి నిర్మించిన సోషియో ఫాంటసీ చిత్రం బింబిసారతో పాటు విడుదల కావడంతో సీతారామం సినిమాకు విడుదలకు ముందు కాస్త తక్కువ బజ్ ఉన్నప్పటికీ, విడుదల తరువాత అటు అద్భుతమైన టాక్ తో పాటు ఇటు బాక్స్ ఆఫీస్ వద్ద రోజురోజుకూ మెరుగవుతూ వచ్చింది.
సీతా రామం సినిమా విజయం కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూస్తారని మరోసారి నిరూపించింది. దుల్కర్ మరియు మృణాల్ వారి పాత్రలకు జీవం పోయడంతో పాటు వారిద్దరి మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ, అబ్బురపరిచే విజువల్స్ కు తోడు హను రాఘవపూడి అద్భుతమైన దర్శకత్వం ఈ సినిమాను విజయవంతం చేయడంలో గొప్ప పాత్ర పోషించాయి.
విడుదలై 4 వారాలకు పైగా గడిచినా ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద సీతారామం సినిమా తన లాంగ్ రన్ ను కొనసాగిస్తూనే ఉంది. సీతా రామం సినిమా ఇప్పటివరకూ ప్రపంచ వ్యాప్తంగా 83 కోట్ల గ్రాస్ కలెక్షన్‌లను నమోదు చేసింది, దుల్కర్ సల్మాన్ కెరీర్ లో ఇంతకు ముందు ఉన్న టాప్ 2 చిత్రాలైన కురుప్ మరియు మహానటి చిత్రాలను అధిగమించి దుల్కర్ సల్మాన్‌కి అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. నిన్ననే సీతారామం సినిమా హిందీలో కూడా విడుదలైంది. అక్కడ కూడా ఈ చిత్రం విజయవంతం అయితే.. 100 కోట్ల గ్రాస్ కూడా సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఒక మలయాళ హీరో, బాలీవుడ్ హీరోయిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఇంత గొప్ప విజయం సాధిస్తుందని బహుశా ఎవరూ ఊహించి ఉండరు. సీతా రామం చిత్రం హీరో దుల్కర్‌కి ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి మార్కెట్‌ని తెచ్చిపెట్టింది. తెలుగులో విడుదలైన 4 వారాలకు సీతా రామం హిందీలో విడుదలైంది. మరి బాలీవుడ్ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎలా ఆదరిస్తారో చూడాలి.
ఈ చిత్రంలో రష్మిక మందన్న కీలక పాత్రలో నటించారు. సుమంత్, తరుణ్ భాస్కర్, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. వైజయంతీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.ఆయన అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు ఎంతగానో ప్రశంసలు వచ్చాయి.