షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఒకదాని తర్వాత మరొకటి రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే ఇండియన్ సినిమా హిస్టరీలోనే హయ్యెస్ట్ డే 1 కలెక్షన్స్ సాధించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ రాబోయే రోజుల్లో పలు పాన్ ఇండియా హీరోల లైఫ్ టైమ్ కలెక్షన్స్ ను బద్దలు కొట్టే దిశగా దూసుకెళ్తోంది.
ఈ బ్లాక్ బస్టర్ తో ఘనమైన రీఎంట్రీ ఇచ్చిన షారుక్ ఖాన్ జనాలను థియేటర్లకు రప్పించి బాలీవుడ్ లో నడుస్తున్న డల్ స్టేజ్ కు తెరదించారనే చెప్పాలి. పఠాన్ విజయం పై బాలీవుడ్ బాద్షా మాట్లాడుతూ తన సహనటులు దీపికా పదుకొనె, జాన్ అబ్రహాం లపై ప్రశంసలు కురిపించారు మరియు ఈ చిత్రాన్ని ఇంత ఘన విజయం సాధించేలా చేసిన తన అభిమానులు మరియు సినీ ప్రేమికులకు తన ప్రేమను తెలియజేశారు.
ఈ సందర్భంగా పఠాన్ సినిమాని లక్ష్యంగా చేసుకున్న బాయ్ కాట్ ఉద్యమం పై అడిగిన ప్రశ్నకు కింగ్ ఖాన్ చాలా అనర్గళంగా మాట్లాడగా, ఆయన ఇచ్చిన సమాధానం పలువురిని విస్మయానికి గురిచేసింది.
మేము ఒకరినొకరు ప్రేమిస్తాము, ఒకరి పై ఒకరు జోక్ చేసుకుంటాము. మేము ఒకరితో ఒకరు సరదాగా ఉంటాము. సరదా, వినోదాన్ని అక్కడే వదిలేయాలి. దీన్ని మరింత సీరియస్ గా తీసుకోవద్దు. మనమంతా ఒక్కటే. మేమందరం ఒకరినొకరం ప్రేమించుకుంటున్నాం, ఆ ప్రేమను చాలా సింపుల్ గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం… ఈమె దీపికా పదుకొనె, ఆమె అమర్. నా పేరు షారుఖ్ ఖాన్, నేను అక్బర్, ఇతను జాన్, అతను ఆంథోనీ. అదే సినిమాని తయారు చేస్తుంది అని ఆయన అన్నారు.
ఆయన తన మాటల్లో బాలీవుడ్ క్లాసిక్ బ్లాక్ బస్టర్ ‘అమర్ అక్బర్ ఆంటోని’ను ఉదాహరణగా తీసుకున్నారు. ఆ చిత్రంలో కథానాయకులు అన్నదమ్ములైనా.. పరిస్థితుల వల్ల ఆ మూడు పాత్రలు మూడు మతాలకు ప్రాతినిధ్యం వహించాల్సి వస్తుంది. మనలో ఎవరికీ, ఏ సంస్కృతికి, జీవితంలోని ఏ అంశానికి తేడాలు ఉండవు. మేం మిమ్మల్ని ప్రేమిస్తున్నాం, అందుకే సినిమాలు చేస్తున్నామని షారుక్ పేర్కొన్నారు.