సోషల్ మెసేజ్ తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ను సమపాళ్లలో రంగరించి సినిమాలు తీయడంలో దిట్టగా శంకర్ కు మంచి పేరుంది. అయితే ఈ మధ్య కాలంలో ఆయన తెరకెక్కించిన సినిమాలలో విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ పై ఫోకస్ పెట్టి ఒక రకంగా ఆయన తప్పు చేసారు. స్ట్రాంగ్ కంటెంట్ కోసం తన సినిమాలు చూసే ప్రేక్షకులు శంకర్ నుంచి ఈ శైలిని ఇష్టపడలేదు.
ఇక గతంలో శంకర్ ఇండియన్ 2 అనౌన్స్ చేసినప్పుడు ఈ సినిమాతో అయినా వింటేజ్ శంకర్ తిరిగి వస్తారని అందరూ అనుకున్నారు కానీ వివిధ కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైంది. ‘భారతీయుడు 2’ సినిమా సెట్లో ఘోర ప్రమాదం జరిగి ముగ్గురు టీం సభ్యులు మృతి చెందారు. ఆ తర్వాత కరోనా మహమ్మారి కారణంగా సినిమా పురోగతి కుంటుపడింది.
అయినా నిర్మాతలు మాత్రం ఈ సినిమా తీయాలనే విషయంలో వెనుకంజ వేయలేదు. ఈ సినిమా టెక్నికల్ క్రూ, నటీనటులకు సంబంధించి కూడా కొన్ని మార్పులు చేశారు. అలా కొన్ని ఒడిదుడుకుల తర్వాత ఈ సినిమా మళ్ళీ పట్టాలెక్కింది.
కమల్ హాసన్ గత చిత్రం విక్రమ్ ను డిస్ట్రిబ్యూట్ చేసిన ఉదయనిధి స్టాలిన్ కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ భారతీయుడు 2 కోసం ఆయనతో మళ్ళీ జతకట్టింది. లైకా ప్రొడక్షన్స్ నిర్మించనున్న ఈ చిత్రాన్ని రెడ్ జెయింట్ సంస్థ సంయుక్తంగా నిర్మించి తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయనుంది.
ఇప్పుడు తాజా వార్తల ప్రకారం ఈ సినిమా కంటెంట్ కు ఇండస్ట్రీ వర్గాల్లో పాజిటివ్ టాక్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు పనిచేసిన వారు సినిమా అదిరిపోయిందని భారీ రిపోర్టులు ఇస్తున్నారట. ఈ సినిమాను 2024 సంక్రాంతి/పొంగల్ కు విడుదల చేయాలని భావిస్తున్నారు.
కమల్ హాసన్ తో పాటు కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, ప్రియా భవానీ శంకర్ కీలక ఈ చిత్రంలో పాత్రలు పోషిస్తున్నారు. కమల్ హాసన్ ‘విక్రమ్’ చిత్రానికి అద్భుతమైన ఆల్బమ్ అందించిన అనిరుధ్ రవిచందర్ భారతీయుడు 2కు కూడా సంగీతం సమకూరుస్తున్నారు. ప్రస్తుతం సీక్వెల్ చిత్రాల హవా నడుస్తుంది కాబట్టి భారతీయుడు 2 ఆ ట్రెండ్ ను కొనసాగిస్తూ భారీ విజయం సాధించాలని కోరుకుందాం.