సమంత ప్రధాన పాత్రలో దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’ నిన్న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా విజయం పై సమంతతో పాటు చిత్ర యూనిట్ అంతా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అయితే శాకుంతలం అందరినీ నిరాశ పరచడంతో ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచే ప్రమాదంలో ఉంది.
ఈ సినిమా బడ్జెట్ దాదాపు 80 కోట్లు అని నిర్మాతలు గతంలో తెలిపారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1.5 కోట్ల షేర్ రాబట్టిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2 కోట్ల షేర్ రాబట్టింది. ఈ రోజు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పూర్తిగా బోల్తా పడటంతో థియేటర్లకు అద్దెలు లభించడం ఏ ఓ పెద్ద ఘనతగా కనిపిస్తోంది. ఆ రకంగా తెలుగు సినిమాల్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచే దిశగా ఈ సినిమా దూసుకెళ్తోంది.
అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచిన కాళిదాసు సంస్కృత నాటకం ‘అభిజ్ఞా శాకుంతలం’ ఆధారంగా భారీ బడ్జెట్ తో రూపొందిన శాకుంతలం తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల అయింది. 3డిలో కూడా విడుదల అయిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం పై దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ తో కలిసి నీలిమ గుణ నిర్మించారు.
సమంత నటించిన శాకుంతలం చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఇందులో దుష్యంత మహారాజు పాత్రలో దేవ్ మోహన్ నటించగా, ప్రిన్స్ భరతుడిగా అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ నటించారు. అదితి బాలన్, ప్రకాష్ రాజ్, గౌతమి, మధు బాలా, సచిన్ ఖేడేకర్, మోహన్ బాబు, అనన్య నాగళ్ల ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మణిశర్మ బాణీలు సమకూర్చారు.